
చట్ట ప్రకారమే అర్జీలను పరిశీలించాలి
లింగంపేట : భూభారతి చట్ట ప్రకారమే రైతుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఆయన లింగంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ బృందాల సమావేశంలో మాట్లాడారు. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లింగంపేట మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. భూములకు సంబంధించిన సమస్యలపై 4,225 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించడానికి తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వారు ఇప్పటివరకు 1,443 దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన చేసి భూములను పరిశీలించారన్నారు. మిగతావాటిని కూడా త్వరగా పరిశీలించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో సంయుక్త సర్వే చేపట్టాలన్నారు. దీర్ఘకాలిక సమస్యలను సైతం పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు శ్రీనివాస్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్లు, రెవెన్యూ, అటవీ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
ఇప్పటివరకు 1,443 దరఖాస్తుల
పరిశీలన
మిగతావాటిని త్వరగా పరిష్కరించాలి
రెవెన్యూ బృందాలతో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్