
కశ్మీర్‌లో యువ జవాన్ వీరమరణం
మద్నూర్(జుక్కల్): మండలానికి సరిహద్దులోని దెగ్లూర్ తాలుకాలోని తమ్లూర్ గ్రామానికి చెందిన వనంజే సచిన్(29) అనే యువ జవాన్ మంగళవారం కశ్మీర్‌లో వీరమరణం పొందినట్లు గ్రామస్తులు తెలిపారు. తమ్లూర్ గ్రామానికి చెందిన వనంజే యాదవ్ కుమారుడు సచిన్‌కు 2017లో సియాచిన్‌లో మొదటి పోస్టింగ్ రాగా, ప్రస్తుతం కశ్మీర్‌లో విధులు నిర్వహించేవాడు. ఈక్రమంలో మంగళవారం సచిన్ వీరమరణం పొందినట్లు సమాచారం అందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మద్నూర్‌లో ఈ సమాచారం అందడంతో ప్రతి ఒక్కరు సచిన్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రమాదవశాత్తు బాలుడి మృతి
మోపాల్: మండలంలోని ముదక్‌పల్లిలోగల ఇటుక బట్టీ వద్ద ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. ఒడిశా రాష్ట్రానికి చెందిన నిత్య నిరంజన్, మందాకిని దర్వా దంపతులు కొన్ని నెలల క్రితం ఉపాధి నిమిత్తం ముదక్‌పల్లిలోని ఇటుక బట్టీకి వచ్చారు. వారు స్థానికంగా రేకుల గుడిసె వేసుకొని నివాసముంటున్నారు. బుధవారం ఉదయం సుడిగాలి రావడంతో రేకుల గుడిసైపె ఉన్న బండరాళ్లు గుడిసెలో ఉన్న వారి కుమారుడు అభినప్ దర్వా (5)పై పడ్డాయి. దీంతో అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వెంటనే నిజామాబాద్‌లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ బాలుడు మృతిచెందాడు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.