
వేసవి సెలవులు.. పిల్లలు భద్రం..
కామారెడ్డి క్రైం: వేసవి వచ్చిందంటే పిల్లలకు పండగే. సరదాగగా ఆడుకోవడం తప్ప ఏ ముప్పు ఎలా వస్తుందో, జాగ్రత్తగా ఎలా ఉండాలో తెలియని పసి హృదయాలు వారివి. బోసి నవ్వులు, ఆటలు, కేరింతలతో ఆనందంగా గడవాల్సిన సమ్మర్ హాలీడేస్ కొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. చిన్న పిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యం పనికి రాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లవేళలా అప్రమత్తంగా వ్యవహరించడం తప్పనిసరి.
సరదా విషాదం కాకూడదు..
వేసవి కూలర్ల వాడకం ప్రతి ఒంట్లోనూ ఉంటుంది. ప్లాస్టిక్‌తో తయారు చేసే కూలర్ ల కంటే ఇనుప బాడీ ఉండే కూలర్ చల్లటి గాలిని ఇస్తుందని మధ్యతరతి కుటుంబాలకు చెందిన చాలా మంది వాడుతుంటారు. ఐరన్ బాడీ కావడంతో విద్యుత్ షాక్ లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల విషయంలో ఇవి అత్యంత ప్రమాదకరం. కుక్కల బెడద ప్రతి గ్రామం లోనూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఇటీవల కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా మారింది. సెలవుల్లో చాలామంది చిన్నారులు సరదా కోసం దగ్గర్లోని చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్లుంటారు. నీట మునిగే ప్రమాదాలు పొంచి ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 20 రోజుల క్రితం క్యాసంపల్లి శివారులోని ఓ కుంటలో నీట మునిగి ఇద్దరు 14 ఏళ్ల బాలురు మృతి చెందిన ఘటనే ఇందుకు ఉదాహరణ. ఇండ్ల ముందర వాహనాల పార్కింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రోడ్ల వెంబడి ఆడుకునే చిన్నారులను గమనించకుండా అతివేగంగా వాహనాలు నడిపే వారు కూడా ఉంటారు. మైనర్ డ్రైవింగ్‌కు తల్లిదండ్రులు అవకాశం ఇస్తే కూడా సమస్యలు ఎదురు కావచ్చు. ఇలాంటి కారణాలతో జరిగే ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు ప్రతి వేసవి లోనూ వెలుగు చూస్తున్నాయి. వేసవి తాపం విషయంలో కూడా పిల్లలకు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చుట్టూ పొంచి ఉండే ప్రమాదాలు..
జిల్లాలో వెలుగుచూస్తున్న ఘటనలు
జాగ్రత్తలు పాటించాలని
నిపుణుల సూచన
ఇటీవల జరిగిన ఘటనలు..
జిల్లాలోని రాజంపేట మండలం గుడి తండాలో దారుణం జరిగింది. పిల్లలందరూ కలిసి ఆడుకుంటుండగా ట్రాక్టర్ న్యూట్రల్ గేర్‌లోకి వచ్చి వెనక్కు జరిగింది. ట్రాక్టర్ టైరు వెనుకనే ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. పది రోజుల క్రితం ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
ఉమ్మడి జిల్లా పరిధి లోని మాక్లూర్ లో 5 ఏళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి అనుకోకుండా ఇనుప కూలర్ ను ముట్టుకున్నాడు. విద్యుత్ షాక్‌కు గురైన బాలుడు అక్కడే చనిపోయాడు. ఐరన్ కూలర్ ల వాడకంతో విద్యుత్ షాక్‌కు గురై చిన్నారులు మృతి చెందిన ఘటనలు గతంలోనూ చూశాం.
నాలుగు రోజుల క్రితం దేవునిపల్లి లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ ఆరేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ముఖం, తొడలపై మాంసం బయటకు వచ్చేలా కరవడంతో బాలుడినిఆస్పత్రిలో చేర్పించారు.
బాన్సువాడలోఇ ద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన విసయం తెలిసిందే. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
అప్రమత్తంగా ఉండాలి
వేసవి సెలవుల్లో పిల్లల సంరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వారిని ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. ప్రమాదకరమైన వస్తువులు, వాహనాలకు దూరంగా ఉంచాలి. మైనర్ డ్రైవింగ్‌కు అనుమతించకూడదు.
– చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి

వేసవి సెలవులు.. పిల్లలు భద్రం..