
ప్రకృతి వనం.. ఆహ్లాదానికి దూరం
పట్టించుకునేవారు లేక ఆనవాళ్లు కోల్పోయిన వైనం
ఎల్లారెడ్డి: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పట్టించుకునేవారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలు, మూడు బల్దియాలలో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధుల నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 6 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి, రక్షణ కోసం కంచెలు, పార్కులో కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి పార్క్ నిర్వహణ కోసం సిబ్బందిని నియమించారు. పట్టణాలలో వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. ప్రజలు సైతం పలుచోట్ల స్వచ్ఛందంగా ముందుకువచ్చి స్థలాలు, బెంచీలు ఇతర సామగ్రి సమకూర్చారు. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఎండిపోతే కొత్తవి నాటాల్సి ఉంటుంది. అయితే ఏర్పాటు చేసిన కొన్నాళ్లకే వీటిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. పంచాయతీలు, మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యాక వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో చాలాచోట్ల ప్రకృతి వనాలు అస్థిత్వాన్ని కోల్పోయాయి. మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారిపోయాయి. పూలు, అలంకార మొక్కలు, ఆహ్లాదాన్ని పంచే వృక్షాలతో కళకళలాడాల్సిన పల్లెప్రకృతి వనాలు ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యి ప్రజలకు ఆహ్లాదం కరువయ్యింది.
మొక్కలు ఎండకుండా చూస్తాం
ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డులలో ఉన్న పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఎండిన మొక్కల చోట కొత్త మొక్కలను నాటుతాం.
– మహేశ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, ఎల్లారెడ్డి