బీబీపేట: వాతావరణంలో ఉష్ణోగ్రత మార్పులతో కోళ్లలో వ్యాధి నిరోధకశక్తి తగ్గిపోయి మృతి చెందుతున్నాయని మండల పశువైద్యురాలు హేమశ్రీ అన్నారు. శనివారం మండలంలోని మల్కాపూర్, తుజాల్‌పూర్, బీబీపేటలో ఉన్నటువంటి కోళ్ల ఫారాలను ఆమె పరిశీలించారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఉన్నట్లు నిర్ధారణ జరిగిందని, బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లలో ముక్కు నుంచి నీరు కారడం, రెక్కలకి పక్షపాతం, మెడ వాయడం వంటి లక్షణాలు కనిపించి చనిపోతాయన్నారు. పౌల్ట్రీ రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తమ ఫారంలో కోళ్లు చనిపోయినట్లైతే ఆకోళ్లను పడేయకుండా భూమిలో పాతిపెట్టాలని, దహనం చేయాలని సూచించారు. షెడ్లని శానిటైజేషన్ చేయాలని తెలిపారు. ఫారాల వద్దకు కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే అన్ని జాగ్రత్తలూ తీసుకొని లోనికి పంపాలని పేర్కొన్నారు. కోళ్లలో మార్పుల కనిపిస్తే పశువైద్యాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.