కామారెడ్డి టౌన్ : బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కందూరి చంద్రశేఖర్ ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల పాటు చేపట్టిన మహాధర్నాలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌ను అంగన్‌వాడీలు ముట్టడించారు. కలెక్టరేట్ ఎదుట గంటన్నరపాటు బైఠాయించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీలకు కనీన వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు వేధింపులు మానుకోవాలని, సెంటర్లకు ఎండకాలం సెలవులు ప్రకటించాలన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షుడు సురేశ్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కార్యకర్తల 23 డిమాండ్‌లను వెంటనే పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ధర్నా అనంతరం బారికేడ్లను తోసుకుని కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు అంగన్‌వాడీ టీచర్లు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఐసీడీఎస్ పీడీ ప్రమీల వారి వద్దకు రాగా వినతిపత్రాలు అందజేశారు. నాయకులు కొత్త నర్సింలు, మోతీరాంనాయక్, వెంకట్‌గౌడ్, రాజనర్సు, అరుణ్, అజయ్, అంగన్‌వాడీ యూనియన్ జిల్లా నాయకులు కల్పన, బాబాయ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజూ కొనసాగిన
అంగన్‌వాడీల ధర్నా
బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నం
అడ్డుకున్న పోలీసులు
అంగన్‌వాడీల నిర్వీర్యానికి కుట్ర