నిజామాబాద్ సిటీ: శ్రీ రామనవమి పండుగ రోజున గురువారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలు తెరిచి ఉంటాయని ఉమ్మడి జిల్లా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కేవీఎన్ రావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ టెలిఫోన్, సెల్‌ఫోన్ల బిల్లులు చెల్లించుకోవచ్చన్నారు. బిల్లులు అందని వారు మీ సేవ కేంద్రాల్లో సంప్రదించాలని, ఎస్‌ఎంఎస్ ద్వారా బిల్లులు కావాలనుకునే వారు తమ మొబైల్ నంబర్లను సేవా కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకోవాలని కోరారు. బీఎస్‌ఎన్‌ఎల్ చాట్ బాట్ ద్వారా కూడా వివిధ సేవలను పొందవచ్చని తెలిపారు.
ముగిసిన ఇంటర్
ఫస్టియర్ పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ముగిశాయి. చివరి రోజు మంగళవారం మొదటి సంవత్సరం రసాయన శాస్త్రం, కామర్స్ పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 18,326 మంది విద్యార్థులకు గాను 17,476 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 850 విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్‌లో 16,226 మందికి గాను 15,557 మంది హాజరుకాగా.. 669 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. అలాగే ఒకేషనల్‌లో 2,100 మంది విద్యార్థులకు గాను 1,929 మంది విద్యార్థులు హాజరు కాగా 181 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. డీఐఈవో రఘురాజ్ నగరంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.