ఇందూరు(నిజామాబాద్ అర్బన్): యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ సొసైటీల అధ్యక్షులకు సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఐడీసీఎంఎస్ కార్యాలయంలో 53వ మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో 40కిపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, త్వరలో వీటిని ప్రారంభించుకోవాలన్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు చేసిన వ్యాపారం, ఖర్చులు అలాగే వచ్చే ఏడాదికి ఆదాయ, వ్యయ అంచనాలను సమావేశంలో చర్చించి తీర్మానించారు. సొసైటీ చైర్మన్లకు గౌరవ వేతనాలు ఇవ్వాలని, ప్రోటోకాల్ అమలు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ ఉపాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు, డీసీవో సింహాచలం, పీఏసీఎస్ చైర్మన్లు, బిజినెస్ మేనేజర్ నగేశ్ పాల్గొన్నారు.