
బీర్కూర్ మంజీర నదిలో చెక్‌డ్యాం నిర్మించాల్సిన ప్రదేశమిదే..
బాన్సువాడ : సహజ వనరులు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉండగా అధికారులు నిద్రావ స్థలో ఉండడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెక్ డ్యాం నిర్మాణం పేరుతో (కంకర, ఇసుక మిక్సింగ్) ప్లాంటు ఏర్పాటు చేసి ప్ర కృతి సంపదను కొల్లగొడుతున్నారు. వారి ఆట క ట్టించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరి స్తూ అనుమానాలకు తావిస్తున్నారు. బీర్కూర్ మండలంలోని మంజీర తీరంలో నాణ్యమైన ఇసుకను నిబంధనలకు విరుద్దంగా తోడేస్తూ రూ. కోట్లు దండుకుంటున్నారు. నిర్ధేశించిన చెక్‌డ్యాం నిర్మాణం పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం.
ఉద్దేశ పూర్వకంగానే..
భూగర్భ జలాల వృద్ధే లక్ష్యంగా మంజీర నదితో పాటు వాగులు, నదులపై చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. బాన్సువాడ చింతల్‌నాగారం శివారులో చెక్ డ్యాం పనులు పూర్తయి భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. దీంతో వ్యవసాయ బోరుల్లో పుష్కలంగా నీటి మట్టం పెరిగింది. బీర్కూర్‌లో నిర్మించాల్సిన చెక్‌డ్యాం పనులు నిలిచిపోయాయి. నిర్మాణ పనుల కోసం నెలకొల్పిన మిక్సింగ్ ప్లాంట్ ఇక్కడి నుంచి తరలించాల్సి ఉండడంతో పాటు సమీపంలో ఇసుక క్వారీల్లో తవ్వకాలు నిలిపేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు కూటమిగా ఏర్పడి ఉద్దేశపూర్వకంగా ప నులు జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
బీర్కూర్ చెక్‌డ్యాం పనులు ఆలస్యం
తరలిపోతున్న ఇసుక
మౌనం వహిస్తున్న అధికారులు
మంజీర తీరంలో..
మంజీర తీరంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా సాగుతున్న తవ్వకాలు గనులు, రెవెన్యూ, పోలీస్ శాఖలకు కూడా తెలిసిన విషయమే. వీటికి తోడు బీర్కూర్ మిక్సింగ్ ప్లాంట్ వల్ల గుట్టలు గుల్లవుతున్నాయి. ఇక్కడి నుంచి ఇసుక, కంకరను మిక్సింగ్ చేసి ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్లాంటు నుంచి 25 కిమీ పరిధికి మించి రవాణాకు అవకాశం లేకున్నా ఇష్టారాజ్యంగా ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ ద్వారా ప్లాంట్‌కు అనుమతి పొందినట్లు చెబుతున్నారు. ఏదేమైనా చెక్‌డ్యాం నిర్మాణ పనులు మూడేళ్లుగా ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.