జగ్గంపేట: జగ్గంపేట ఏరియాలో సంచరిస్తున్న మహిళా బ్యాగ్ దొంగలు ముఠా ఆచూకీ తెలిసిన వెంటనే ఆటో డ్రైవర్లు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. జగ్గంపేటలో స్థానికులు, ఆటో డ్రైవర్లకు ఆయన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా దొంగలు ఆటోలో తిరుగుతూ బ్యాగ్‌లు చోరీ చేయడం, బస్‌లు ఎక్కేటప్పుడు, వెనక వుండి విలువైన వస్తువులు, హేండ్ బ్యాగ్‌లు చోరీ చేస్తున్నారని అన్నారు. ఒక ముఠా సభ్యులు ఈ నేరాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తమ వాహనాలను రోడ్లుపై నిలపాలని, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. ఆటోలో ప్రయాణించే వారి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు, ఎస్సై రఘునాథరావు పాల్గొన్నారు.


