దే..వుడా! | - | Sakshi
Sakshi News home page

దే..వుడా!

Mar 7 2026 7:26 AM | Updated on Mar 7 2026 7:26 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దేవదాయ శాఖలో వింత పొగడ సాగుతోంది. కొంత మంది తక్కువ క్యాడర్‌ కార్యనిర్వహణాధికారుల(ఈఓ)కు పెద్ద దేవాలయాలను అప్పగిస్తున్నారు. అదే సమయంలో అర్హులైన అధికారులను చిన్నచిన్న ఆలయాలకు ఈఓలుగా నియమిస్తున్నారు. దీనిపై ఆ శాఖ అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం వార్షికాదాయం రూ.కోటి పైబడిన ఆలయాల్లో డిప్యూటీ కమిషనర్‌ (డీసీ), రూ.50 లక్షల నుంచి రూ.కోటి లోపు ఆదాయం వచ్చే ఆలయాల్లో అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఏసీ) హోదా కలిగిన వారిని ఈఓలుగా నియమించాలి. అలాగే, రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు ఆదాయం వచ్చే ఆలయాల్లో గ్రేడ్‌–1, రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల ఆదాయం వచ్చే ఆలయాల్లో గ్రేడ్‌–2, రూ.15 లక్షలలోపు ఆదాయం వచ్చే ఆలయాలకు గ్రేడ్‌–3 ఈఓలను నియమించాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ నిబంధనలు ఏమాత్రం అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా ఇష్టానుసారం ఈఓల నియామకాలు జరుగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా చిన్న ఆలయాల్లో పని చేస్తున్న ఈఓలను పెద్ద దేవస్థానాలకు నియమిస్తున్నారు.

● ఎంతో పేరొందిన తుని రూరల్‌ తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఇక్కడ డీసీ స్థాయి అధికారిని ఈఓగా నియమించాలి. కానీ, ఏసీ హోదా కలిగిన పి.విశ్వనాథరాజును ఈఓగా నియమించారు.

● అలాగే, వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాల్లో పిఠాపురం పాదగయ క్షేత్రం ఒకటి. ఇక్కడి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానానికి ఏసీ హోదా కలిగిన అధికారిని ఈఓగా నియమించాలి. కానీ, పెద్దాపురం మహారాణి సత్రం ఈఓగా పని చేస్తున్న కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌ను ఇక్కడ ఈఓగా నియమించారు. ఆయన గ్రేడ్‌–2 ఈఓ అయినప్పటికీ ఇక్కడ ఈఓగా నియమించడం గమనార్హం. గతంలో ఏసీ హోదా కలిగిన అల్లు గంగాభవాని ఈ ఆలయంలో ఈఓగా ఉండేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమెను వేరే ఆలయానికి బదిలీ చేశారు. ప్రస్తుత ఈఓకు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడంతో ఇక్కడ భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే విమర్శలు తరచుగా వస్తున్నాయి. ఇటీవల మహాశివరాత్రి వేడుకల్లో కలెక్టర్‌, ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి ఇక్కడి వ్యవహారాలు చక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

● కాకినాడ సినిమా రోడ్డులోని మంత్రిప్రగడ వారి సత్రానికి గ్రేడ్‌–1 ఈఓను నియమించాలి. కానీ, గ్రేడ్‌–2 ఈఓగా పని చేస్తున్న శ్రీనివాస్‌ను ఇక్కడ నియమించారు. కాకినాడ రూరల్‌ కొవ్వూరులోని వారాహి అమ్మవారి దేవస్థానం ఇన్‌చార్జి బాధ్యతలు సైతం ఆయనకే అప్పగించారు. ఈ ఆలయంలో గ్రేడ్‌–1 ఈఓగా పని చేస్తున్న సౌజన్యను తొలగించి గ్రేడ్‌–2 అయిన శ్రీనివాస్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషం.

● కాకినాడ బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఈఓగా పని చేస్తున్న ఉండవల్లి వీర్రాజు చౌదరి గ్రేడ్‌–2 ఈఓ. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పని చేస్తున్న చింతపల్లి విజయభాస్కర్‌రెడ్డిని తొలగించి, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం ఈఓగా పని చేస్తున్న చౌదరికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

దేవదాయ శాఖలో వింత పోకడ

పెద్ద దేవస్థానాల్లో తక్కువ క్యాడర్‌ అధికారుల నియామకం

అర్హత ఉన్న ఈఓలకు

చిన్న దేవాలయాలు

రెండేళ్లుగా పదోన్నతుల ఊసే లేదు

అర్హులకు చిన్న ఆలయాలతో సరి..

జిల్లాలో గ్రేడ్‌–1 ఈఓలున్నప్పటికీ వారికి చిన్నచిన్న ఆలయాలే కేటాయిస్తున్నారు. కాకినాడ తూరంగేశ్వర స్వామి ఆలయ ఈఓ శివబాబు గ్రేడ్‌–1 ఈఓ అయినప్పటికీ ఆయనకు గ్రేడ్‌–2 ఆలయం కేటాయించారు. ఆయన ప్రస్తుతం అసిస్టెంట్‌ కమిషనర్‌ పదోన్నతికి సైతం అర్హుడైనప్పటికీ చిన్న ఆలయం మాత్రమే కేటాయించారు.

కాకినాడ పెద్ద మార్కెట్లోని నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం గ్రేడ్‌–2 ఆలయం. కానీ, ఇక్కడ గ్రేడ్‌–1 ఈఓ ఎం.మురళీ వీరభద్రరావు ఈఓగా పని చేస్తున్నారు.

నడకుదురు గ్రూప్‌ టెంపుల్‌ ఈఓగా పని చేస్తున్న టీవీ సూర్యనారాయణ సైతం గ్రేడ్‌–1 అయినప్పటికీ గ్రేడ్‌–2 ఆలయాలే కేటాయించారు. అన్ని అర్హతలూ ఉన్న్పటికీ తమకు చిన్నచిన్న ఆలయాలు మాత్రమే కేటాయించడంపై గ్రేడ్‌–1 ఈఓలు మండిపడుతున్నారు. దీనిపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు సైతం నివేదించినప్పటికీ ఎటువంటి ప్రయోజనమూ ఉండటం లేదని మధనపడుతున్నారు. గ్రేడ్‌–1 ఈఓలు రిటైరైనప్పటికీ ఆయా ఆలయాలకు అదే స్థాయి అధికారులను నియమించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సిఫారసు లేఖల ఆధారంగా ఆ స్థానాలను గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 ఈఓలకు కేటాయిస్తున్నారని గ్రేడ్‌–1 ఈఓలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement