మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

Mar 9 2026 7:32 AM | Updated on Mar 9 2026 7:32 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్‌ షణ్మోహన్‌ అన్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సెర్ప్‌, మెప్మా విభాగాల సౌజన్యంతో స్థానిక కుళాయి చెరువు పార్కు వద్ద కళాక్షేత్రంలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ సమగ్రాభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబ, సమాజ అభివృద్ధి వేగవంతమవుతాయని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు రుణాలు, సబ్సిడీలు, శిక్షణలు, మార్కెటింగ్‌ సహాయం వంటి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్‌ మాట్లాడుతూ, బాలికల చదువు పట్ల ఉన్న ఆలోచనా దృక్పథాన్ని తల్లిదండ్రులు మార్చుకోవాలని, వారిని కేవలం పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ వరకే పరిమితం చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన మహిళలను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement