భయం గుప్పిట్లో ప్రజలు
గోకవరం: అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో గోకవరం మండలం మల్లవరం వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గంగవరం మండలంలో పులి సంచరిస్తుండటంతో తమ గ్రామంలోకి పులి ప్రవేశిస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం పులి సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరోపక్క అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఫ పులికొండ వద్ద పులి మకాం!
ఫ బంధించేందుకు అధికారుల యత్నం
అడ్డతీగల: పులి జాడ అంతు చిక్కకుండా పోతోంది.. అందరినీ పరుగులు తీయిస్తోంది.. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చివరికి కన్నుగప్పి మయం అవుతోంది.. కొద్ది రోజులుగా మన్యంలో పెద్ద పులి సంచారంతో అందరిలో ఆందోళన రేగుతోంది. జిల్లాలోని ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతమైన పులికొండ వద్ద పెద్ద పులి రెండు రోజులుగా మకాం చేసింది. తన ఉనికిపై అటవీ అధికారులను ఆలోచనలో పడేసింది. గంగవరం మండలం ట్యాంకుబీడు ప్రాంతంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన అటవీ శాఖ రెస్క్యూ టీం సభ్యులు డ్రోన్‌లు, ట్రాకింగ్ కెమెరాలతో పులి సంచారాన్ని ట్రాకింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ముఖ్యమైన చోట్ల అమర్చారు. పులి సంచరిస్తే ఆ దృశ్యాలు, ఈ కెమెరాల్లో నిక్షిప్తమవుయనే ఆలోచనతో వీలైనన్ని ట్రాప్ కెమెరాలను రప్పించి నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చారు. మరోవైపు పులిని బంధించేందుకు కొన్ని ఆవులను అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు తెలియవచ్చింది. రాత్రి సమయాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఆ పెద్ద పులి ప్రయాణిస్తుంది. ఏలేరు జలాశయం బ్యాక్ వాటర్‌కు చేరువలో ఉన్న పులికొండ తన ఆవాసానికి అనువుగా ఉన్న నేపథ్యంలో పులి ఆ ప్రాంతంలో తిష్ట వేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులి ఎటువైపు వెళ్తుందో తెలియక అధికారులు డోలాయమానంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో గంగవరం మండలం ట్యాంక్‌బీడు, మొల్లేరు, మల్లవరం, రాముల్దేవపురం, వడ్డిచెరువు, అడ్డతీగల మండలం గడిచిన్నంపాలెం, డి.కృష్ణవరం వంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సూదికొండ అటవీ క్షేత్రం పరిధి నుంచి రాజవొమ్మంగి అటవీ క్షేత్రం పరిధిలోకి పులి ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. దీంతో అడ్డతీగల, రాజవొమ్మంగి అటవీ క్షేత్రాల పరిధిలోని అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.


