అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజాము ముహూర్తాల్లో రత్నగిరితో పాటు ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. దీంతో, ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టుతో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. నిత్య కల్యాణ మండపంలో 30 మంది స్వామివారి నిత్య కల్యాణంలో పాల్గొన్నారు. సుమారు 40 వేల మంది భక్తులు రాగా, దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. రత్నగిరితో పాటు పలు ప్రాంతాల్లో శనివారం నుంచి సోమవారం వరకూ పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజులూ కూడా ఆలయంలో రద్దీ నెలకొనే అవకాశం ఉంది.
పకడ్బందీగా జనగణన
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 16వ జనగణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అన్నారు. జనగణనలో భాగంగా మొదటి దశలో చేపట్టనున్న ‘గృహాల జాబితా, గృహ వసతుల గణన’పై కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన శిక్షణను ఆయన పరిశీలించారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ శిక్షణలో అధికారులు జనగణనపై పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. గృహ నిర్మాణం, తాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్, ఇంటర్నెట్ వంటి 33 కీలక అంశాలపై సమగ్ర సమాచారం సేకరించాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం చట్టరీత్యా బాధ్యతని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ టి.తిప్పేనాయక్, జనగణన జాయింట్ డైరెక్టర్ సాయి శేఖర్ పాల్గొన్నారు.
9న అప్రెంటీస్ మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 9న ప్రైమ్ మినిస్టర్ నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నారు. ఐటీఐ ప్రిన్సిపాల్ వేణుగోపాలవర్మ శుక్రవారం ఈ విషయం తెలిపారు. పాత ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పూర్తి చేసుకుని, ఎన్‌టీసీ సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 8 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 94404 08182 నంబరులో సంప్రదించాలని పేర్కొన్నారు.
ప్రణాళికాబద్ధంగా
రబీ ధాన్యం సేకరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. రబీ ధాన్యం సేకరణకు అనుసరించాల్సిన విధానాలపై రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, మార్కెటింగ్, సహకార, రవాణా, తూనికలు – కొలతలు, ఎఫ్‌సీఐ అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి అంచనా, సేకరణ కేంద్రాలు, సీఎంఆర్ రైస్, కనీస మద్దతు ధర వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. రబీలో గ్రేడ్–ఎ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2,389 (75 కేజీలకు రూ.1,792), సాధారణ రకానికి రూ.2,369 (75 కేజీలకు రూ.1,777)గా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించిందని జేసీ తెలిపారు. జిల్లావ్యాప్తంగా రబీలో 6,76,773 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇందులో స్థానిక వినియోగం 67,677 మెట్రిక్ టన్నులు పోను సుమారు 6,09,096 మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు రానున్నదని తెలిపారు. ఈ ధాన్యం కొనుగోలుకు జిల్లాలోని 225 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.


