అప్పులపై సమాధానం చెప్పండి | - | Sakshi
Sakshi News home page

అప్పులపై సమాధానం చెప్పండి

Mar 7 2026 7:26 AM | Updated on Mar 7 2026 7:26 AM

కాకినాడ రూరల్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ మహిళా నేత జమ్మలమడక నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వల్లే రాష్ట్రం అప్పుల పాలైందని అనడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, రెవెన్యూ లోటు రూ.60,480 కోట్లకు చేరడం ఈ ప్రభుత్వ అసమర్థత కాదా అని ప్రశ్నించారు. సాకులు వెతకడం మాని, కూటమి ప్రభుత్వం చేసిన అప్పులకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ‘ఎన్టీఆర్‌ జిల్లాలో జల్‌ జీవన్‌ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పైపులైన్లు వేసినా నీళ్లు రావు. సంపులు కట్టినా కనెక్షన్లుండవు. 181 పనులకు గాను 71 పనులు అసలు మొదలే కాలేదు. దీనికి పవన్‌ కల్యాణ్‌ ఏం సమాధానం చెబుతారు’ అని ప్రశ్నించారు. మదనపల్లి వంటి ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అధికారులే చందాల పేరిట ప్రజలు, వ్యాపారుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇది కూటమి పారదర్శక పాలనకు నిదర్శనమా అని ఎద్దేవా చేశారు.

విజయవాడ వంటి నగరాల్లోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో కూడా డాక్టర్లు, సిబ్బంది లేక రోగులు అల్లాడుతున్నారని, మందుల కొరత వేధిస్తూంటే పాలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో పవన్‌ కల్యాణ్‌ పూర్తిగా విఫలమయ్యారన్నారు. మినీ గోకులాలు, సిమెంట్‌ రోడ్ల బిల్లులు రాక రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఊదరగొడుతున్న పాలకులు, వాస్తవానికి గ్రౌండ్‌ అయిన ప్రాజెక్టులు ఎన్నో చెప్పలేకపోతున్నారన్నారు. అసెంబ్లీలో వైఎస్సార్‌ సీపీపై విమర్శలు మాని, ముందుగా తమ శాఖల్లో జరుగుతున్న అవినీతి, క్షేత్రస్థాయిలో పనుల జాప్యాన్ని అరికట్టేందుకు పవన్‌ కల్యాణ్‌ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. శ్వేతపత్రాల పేరిట కాలక్షేపం చేయకుండా, పెండింగ్‌ బిల్లులు విడుదల చేసి, పేదలకు న్యాయం చేయాలని నాగమణి డిమాండ్‌ చేశారు.

ఏలేరు కాలువలో వ్యక్తి గల్లంతు

ఏలేశ్వరం: ఏలేరు రిజర్వాయర్‌ నుంచి విశాఖపట్నానికి నీరందిస్తున్న కాలువలో ప్రమాదవశాత్తూ పడిపోయి ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. ఏలేశ్వరం క్వారీ ప్రాంతానికి చెందిన బంగర్తి విజయ్‌, గిడుతూరి లోవరాజులు శుక్రవారం ఉదయం క్వారీ పనులకు గొంటువానిపాలెం వెళ్లారు. సాయంత్రం బైక్‌పై తిరిగి వస్తున్నారు. సి.రాయవరం వద్దకు వచ్చేసరికి వారి మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పడంతో ఇద్దరూ బైక్‌తో సహా ఏలేరు ఎడమ కాలువలో పడ్డారు. గమనించిన స్థానికులు కాలువలో గాలించారు. లోవరాజు గల్లంతవగా, విజయ్‌ను రక్షించారు. స్వల్పంగా గాయపడిన అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోవరాజుకు భార్య నాగమణి, కుమార్తెలు నవ్య, లోవకుమారి ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లోవరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement