● మరణ మృదంగం మోగిస్తున్న
వేట్లపాలెం బాణసంచా పేలుడు
● ఇప్పటి వరకూ 28 మంది బలి
● మృతుల్లో 17 మంది వేట్లపాలెం వాసులే
● వరుస మరణాలతో పెను విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృత్యుదేవత వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో గత శనివారం సంభవించిన భారీ బాణసంచా విస్ఫోటం ఇంకా మరణమృదంగాన్ని మోగిస్తూనే ఉంది. ఆ రోజున సంఘటన స్థలంలోనే 20 మంది సజీవదహనమైపోయారు. తీవ్రంగా ఒళ్లు కాలిపోయిన తొమ్మిది మందిని అదే రోజు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆ రోజు నుంచి మంగళవారం వరకూ రోజుకొకరు చొప్పున.. బుధవారం ముగ్గురు, తాజాగా గురువారం ఇద్దరు మృత్యు ఒడికి చేరుకున్నారు. ఇలా క్షతగాత్రుల్లో ఎనిమిది మరణించడంతో ఈ ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 28కి పెరిగింది. తమవారు కోలుకుని తిరిగి వస్తారని ఆశ పడిన వారి కుటుంబాలకు చివరకు కన్నీటి వేదనే మిగిలింది. రాష్ట్ర చరిత్రలోనే ఇంత మంది ప్రాణాలు బలైపోయిన అత్యంత భారీ బాణసంచా విస్ఫోటం ఇదే కావడం గమనార్హం.
సగానికి పైగా వేట్లపాలెం వారే..
ఈ ప్రమాద మృతులందరూ సామర్లకోట, పెద్దాపురం మండలాలకు చెందిన వారే. వీరిలో కూడా సామర్లకోట మండలంలోని రెండు ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటి వరకూ మొత్తం 28 మంది ఈ ప్రమాదంలో మరణించగా.. వీరిలో సగానికి పైగా అంటే.. 17 మంది వేట్లపాలెం వాసులే కావడం గమనార్హం. నిత్యం కళ్ల ముందే తిరిగిన వారందరూ ఐదారు రోజుల వ్యవధిలోనే తమను విడిచి వెళ్లిపోయారనే విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వేట్లపాలెం తరువాత అత్యధికంగా సామర్లకోటలోని కుమ్మర వీధికి చెందిన ఏడుగురిని ఈ బాణసంచా విస్ఫోటం పొట్టన పెట్టుకుంది. దీంతో, ఆ వీధిలోని వారి ఆవేదనకు అంతే లేకుండా పోతోంది. ఆస్పత్రిలో కోలుకుని, క్షతగాత్రులు ఇళ్లకు తిరిగొస్తారనుకుంటే అంతలోనే చావు కబురు వినాల్సి వస్తోందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. పొట్టకూటి కోసం బాణసంచా తయారీ పనికి వెళ్లడమే వారు చేసిన పాపం అన్నట్టుగా మారిందని చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు. ఏ కుటుంబాన్ని కదిలించినా పొంగుకొస్తున్న కన్నీటితో గుండెలు బద్దలయ్యేలా విలపిస్తున్నారు. అందరూ రోజు కూలీలే కావడంతో వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మృతులందరూ 25 నుంచి 55 సంవత్సరాల వయస్సు వారే. దీంతో, అందరూ దాదాపు అర్ధాయుష్షుతోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వేట్లపాలెం, కుమ్మర వీధితో పాటు జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం, పెద్దాపురం వాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మేడపాడుకు చెందిన భార్యాభర్తలు గంపల నాగరాజు, గంపల మంగ ఈ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో, గడచిన నాలుగు రోజులుగా వారి కుమారుడు, ఇద్దరు కుమార్తెలను ఓదార్చడం ఎవ్వరి వల్లా కావడం లేదు.
మృత్యువుతో పోరాడుతున్న దావీదు
ఈ సంఘటన జరిగిన శనివారం నుంచి గడచిన ఆరు రోజులుగా సామర్లకోట కుమ్మర వీధికి చెందిన 39 ఏళ్ల వేమగిరి దావీదు కాకినాడ జీజీహెచ్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు. అతడినైనా క్షేమంగా తిరిగి పంపించు దేవుడా అంటూ ఆ వీధిలోని స్థానికులు ప్రార్థిస్తున్నారు. 70 నుంచి 80 శాతం కాలిన గాయాలతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది ఇప్పటి వరకూ మృతి చెందారు. మరో క్షతగాత్రుడు దావీదు ఆరోగ్యం మెరుగు పరిచేందుకు జీజీహెచ్ వైద్యులు శ్రమిస్తున్నారు. వైద్య పరీక్షల్లో అతడి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉన్నట్టు గుర్తించి, ఆ మేరకు చికిత్స చేస్తున్నారు. వాస్తవానికి దావీదుకు సోమవారం ప్లాస్టిక్ సర్జరీ చేయాలని జీజీహెచ్ వైద్యులు భావించారు. అయితే, ఆ సర్జరీ అవసరం లేకుండా మందులతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
మెరుగుపడిన ‘ఆమె’ ఆరోగ్యం
ఈ ప్రమాదంలో గాయపడి, కాకినాడ రామారావుపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పచ్చిగళ్ల నూకరత్నం ఆరోగ్యం మెరుగు పడింది. ఆమెను గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయాలని భావించారు. అయితే, మరో 48 గంటలు ఆస్పత్రిలో ఉంచడమే మంచిదన్న యాజమాన్య సూచనతో డిశ్చార్జి ప్రక్రియను వాయిదా వేశారు. సామర్లకోట తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈమె కాకుండా పేలుడు జరిగిన రోజున పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన చాపల శామ్యూల్ స్వల్ప గాయాలతో బయటపడి, మృత్యుంజయుడిగా నిలిచాడు. సామర్లకోట సీహెచ్‌సీలో చికిత్స అనంతరం అతడిని ఈ నెల 3న డిశ్చార్జి చేసి, ఇంటికి పంపించారు.
మరో ఇద్దరి మృతి
సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా పేలుడు బాధితులు మరో ఇద్దరు.. మృత్యువుతో పోరాడలేక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో, వారి కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో గత శనివారం జరిగిన భారీ విస్ఫోటంలో వేట్లపాలెం గ్రామానికి చెందిన సప్ప సత్యవేణి (34), పెద్దాపురానికి చెందిన మోర్త శ్రీను (30) తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచీ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారు గురువారం మృతి చెందారు. మృతురాలు సత్యవేణికి భర్త లేడు. 18 సంవత్సరాల కుమారుడు రాజేష్, 16 సంవత్సరాల కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. తల్లి మృతితో వారిద్దరూ అనాథలుగా మిగిలారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సహాయం చెక్కును పిల్లలిద్దరి పేరిట ఇస్తామని తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. మరో మృతుడు మోర్త శ్రీనుకు భార్య అనిత, మూడేళ్ల కుమారుడు హర్ష ఉన్నారు. శ్రీను మరణ వార్త తెలియడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ముగినిపోయింది. ప్రమాదం జరిగి ఐదు రోజులు గడచిపోవడంతో ప్రాణాలతో బయట పడతాడనుకున్నామని, మృత్యువుతో పోరాడి, తన భర్త ఓడిపోయాడని అనిత రోదించింది. తమకు దిక్కు లేకుండా పోయిందని రోదించింది.


