బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యా శాఖలో వింత పోకడ రాజ్యమేలుతోంది. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉపాధ్యాయులపై అదనపు భారాలు మోపుతోంది. ఇప్పటికే పదో తరగతి ప్రత్యేక తరగతుల పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించింది. తాజాగా పదో తరగతి పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతల విషయంలోనూ ప్రభుత్వం వింత నిర్ణయం తీసుకుంది. ఏటా టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ బాధ్యతలను జిల్లా స్థాయిలో విద్యా శాఖ అధికారుల ద్వారా చేపట్టడం పరిపాటి. ఈసారి అలా కాకుండా ఆటోమేషన్ విధానంతో రాష్ట్ర స్థాయిలో ఇన్విజిలేషన్ నియామకాలు జరపాలని నిశ్చయించింది. దీనివలన దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధ పడుతున్న వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారికి సైతం టెన్త్ ఇన్విజిలేషన్ విధులు పడే అవకాశాలుంటాయి. అలాగే, సుదూర ప్రాంతాల్లో ఇన్విజిలేషన్ విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధానం పూర్తి అసంబద్ధమని ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో డీఈఓ ఆధ్వర్యాన..
జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి 29,637 మంది హాజరు కానున్నారు. వీరిలో బాలురు 14,634 మంది, బాలికలు 15,003 మంది ఉన్నారు. దశాబ్దాలుగా టెన్త్ పరీక్షల ఇన్విజిలేషన్ విధులను జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) పర్యవేక్షణలో ఉపాధ్యాయుల సీనియారిటీ ఆధారంగా కేటాయిస్తున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల నిర్వహణ సీఎస్ పర్యవేక్షణలో ఉంటుంది. సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు డీఓలుగా, జూనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ఏడీఓలుగా విధుల కేటాయింపు దశాబ్దాలుగా జరుగుతోంది. డీఓగా పని చేసిన అనుభవం ఉన్న హెచ్‌ఎంకే సీఎస్ డ్యూటీలివ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, ఈ ఏడాది కొత్తగా డీఈఓకు సంబంధం లేకుండా రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు విజయవాడ కమిషనర్ కార్యాలయం నుంచే ఇన్విజిలేషన్ విధులు కేటాయించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులకు, చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ (డీఓ), అసిస్టెంట్ డీఓ(ఏడీఓ)లకు లీప్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా విధులు కేటాయించారు.
వారిది కీలకపాత్ర
పరీక్ష నిర్వహణలో సీఎస్, డీఓలదే కీలక పాత్ర. పరీక్ష కేంద్రంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవడం, పరీక్షలు జరిగే రోజుల్లో విద్యా శాఖ రోజువారీ నిర్వహించే సెట్ కాన్ఫరెన్స్‌కు హాజరవడం, ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాల అమలుకు కేంద్రంలో ఏర్పాట్లు చేయడం, ముఖ్యంగా పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగా సంబంధిత పోలీసు స్టేషన్లకు వెళ్లి, ప్రశ్నపత్రాల బండిళ్లను పరీక్ష కేంద్రానికి భద్రంగా తీసుకు రావడంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్ల నుంచి వివరాలు తీసుకోవడం, మిగతా శాఖలైన పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ, శానిటేషన్, మున్సిపల్/పంచాయతీరాజ్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, సమన్వయం చేసుకోవడం తదితర పనులన్నీ సీఎస్‌లు, డీఓలే చూస్తూంటారు.
విజయవాడ నుంచి నేరుగా
టెన్త్ ఇన్విజిలేషన్ విధుల కేటాయింపు
ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులకు అతీతంగా డ్యూటీలు
దూర ప్రాంతాల్లో నియమించే అవకాశం
అసంబద్ధ విధానమంటూ ఉపాధ్యాయుల ఆగ్రహం
జిల్లా విద్యా శాఖను డమ్మీ చేయడమే...
పదో తరగతి పరీక్షల్లో సీఎస్, డీఓ, ఇన్విజిలెటర్ల డ్యూటీలు కమిషనర్ కార్యాలయం నుంచి కేటాయించడమంటే డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓలను డమ్మీలను చేయడమే. ఆ జిల్లాలపై వారికే పట్టు ఉంటుంది. పరీక్షలు ఎలా నిర్వహించాలో అనుభవం ఉంటుంది. అలాంటిది వారికి సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించడమంటే నేల విడిచి సాము చేయడమే. జిల్లా విద్యా శాఖ అధికారులపై నమ్మకం లేకనే ఈ విధంగా ఉత్తర్వులిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఎవరు చేయాల్సిన పనిని వారితో చేయిస్తేనే వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది.
– చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
జిల్లా స్థాయి అధికారి ప్రాధాన్యం లేకుండా..
విద్యా శాఖలో డీఈఓ, ఎంఈఓలు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా కమిషనరేట్ నుంచే తీసుకోవడం మంచి సంప్రదాయం కాదు. ఇంతవరకూ టెన్త్ పరీక్షల విధులపై ఎలాంటి అవగాహనా లేని వారికి ఆర్డర్లు ఇవ్వడం, కొన్నిచోట్ల సీనియర్లను విస్మరించి, జూనియర్లకు డ్యూటీలు వేసే విధానం మంచిది కాదు. అనారోగ్య కారణాలతో బాధ పడే వారికి డ్యూటీలు కేటాయించడం సహేతుకం కాదు.
– మోర్త శ్రీనివాస్, ఎస్‌టీయూ రాష్ట అదనపు ప్రధాన కార్యదర్శి
పొరపాటు సవరించాలి
టెన్త్ పరీక్షలకు రాష్ట్ర స్థాయి నుంచి కేటాయించిన డ్యూటీల్లో పారదర్శకత కనిపించడం లేదు. జూనియర్ ఉపాధ్యాయులకు సీఎస్ ఇచ్చారు. సీనియర్‌లకు డీఓలు, ఏడీఓలుగా ఇచ్చారు. ఇది సరికాదు. కమిషనర్ ఆధ్వర్యాన డ్యూటీల కేటాయింపులో తికమకలు చోటు చేసుకున్నాయి. ఈ పొరపాటును సవరించాలి.
– ఎస్.సత్యనారాయణ, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
పరీక్ష ముగిసిన తర్వాత...
జవాబుపత్రాలను పోస్టాఫీసులో పార్సిల్ చేసేంత వరకూ సీఎస్, డీఓలిద్దరూ పరస్పర సమన్వయంతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా పరీక్షలు జరిగే రోజుల్లో మిగిలిన సిబ్బంది కంటే ముందుగానే ఉదయం 6 నుంచి 7 గంటల్లోగా వీరు తమతమ కేంద్రాలకు చేరుకోవాలి. ఇన్ని కీలక బాధ్యతలున్న సీఎస్, డీఓలను సాధారణంగా ప్రస్తుతం పని చేస్తున్న స్కూలు నుంచి గరిష్టంగా 30 కిలోమీటర్ల పరిధికి లోబడి నియమిస్తూంటారు. కానీ, విద్యా శాఖ టెన్త్ పరీక్షల సిబ్బంది విధుల కేటాయింపునకు ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం దీనికి భిన్నంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తన వద్ద ఉన్న టీచర్ల సమాచారం (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం – టిస్) ఆధారంగా జిల్లా విద్యా శాఖతో సంబంధం లేకుండా, క్షేత్ర స్థాయిలో దూరాభారంతో నిమిత్తం లేకుండా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


