అసెంబ్లీ సాక్షిగా యనమల అబద్ధాలు | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా యనమల అబద్ధాలు

Mar 6 2026 8:12 AM | Updated on Mar 6 2026 8:12 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు వల్లె వేయడం తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ ఉద్యోగులు తొమ్మిది అంశాలపై సమాధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే ఉద్దేశంతోనే తుని ఎమ్మెల్యే చంద్రబాబు మాదిరి డైవర్షన్‌ రాజకీయాలు ఆచరిస్తున్నట్లున్నారని విమర్శించారు. ఈ మేరకు లక్ష్మీ శివకుమారి గురువారం ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే అయి రెండేళ్లవుతున్నా తన నియోజకవర్గంలో అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, అనుమతులు ఎలా వస్తాయి, ఎవరిస్తారనే కనీస అవగాహన దివ్యకు లేకపోవడం అన్యాయమన్నారు. ఒక పంచాయతీలో అంగన్‌వాడీ భవనం మంజూరుకు అక్కడి సర్పంచ్‌తో పాటు పాలకవర్గం సీడీపీవో ద్వారా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన అందజేయాలని, స్థలం మంజూరు నుంచి పనులు అప్పగించే వరకూ కలెక్టర్‌దే తుది నిర్ణయమనే విషయాలు తెలియనందువల్లనే దివ్య అసెంబ్లీలో అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నామన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నాటి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై లేని పోని రాజకీయ ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమారి హితవు పలికారు. నియోజకవర్గంలో నలుగురికి ఉపయోగపడే అంగన్‌వాడీ భవనాలు నిర్మిస్తే పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని అభిలషించే రాజా.. అసంపూర్తి భవనాలతో నిధులు కాజేశారంటూ సత్యదూరమైన ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్‌వాడీలకు మంచి చేయాల్సిందిపోయి అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. వాస్తవాలపై అవగాహన పెంచుకోవాలని దివ్యకు హితవు పలికారు. వైఎస్సార్‌ సీపీపై లేని పోని ఆరోపణలు చేయడం బాధ్యత అనిపించుకోదని, ఇప్పటికై నా ఆ పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement