బాబూ.. అంగన్‌వాడి చూపుతాం | - | Sakshi
Sakshi News home page

బాబూ.. అంగన్‌వాడి చూపుతాం

Mar 5 2026 7:25 AM | Updated on Mar 5 2026 7:25 AM

కపిలేశ్వరపురం/సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓట్లు దండుకునే వైఖరి సీఎం చంద్రబాబుది. 2000 సంవత్సరంలో శ్రామిక మహిళలను గుర్రాలతో తొక్కించిన ఆయన మరోసారి కూటమి ప్రభుత్వంలో మహిళలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల హామీ అమలు చేయాలన్న డిమాండ్‌తో ‘చలో విజయవాడ’ చేపట్టిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంగన్‌వాడీలను పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పి వారిని కష్టాలు పెట్టారు.

ఉద్యమానికి ఊపిరి

ప్రధానంగా వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్‌ను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న డిమాండ్లతో ఆందోళనకు పిలుపు నిచ్చిన అంగన్‌వాడీలను విజయవాడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు వేల మంది విజయవాడ ధర్నా చౌక్‌కు తరలివెళ్లారు. అక్కడి శిబిరంలో పోలీసులు చేపట్టిన దమనకాండలో కాకినాడకు చెందిన యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, మండపేటకు చెందిన కె.కృష్ణవేణిలతో పాటు అనేక మంది తీవ్ర అణచివేతకు గురయ్యారు. ప్రతిఘటిస్తున్న అంగన్‌వాడీలను పోలీసులు పిన్నులతో గుచ్చారు. ఈడ్చుకెళ్తుండగా జి.బేబీరాణి చేతికి తీవ్ర గాయమైంది. ఆమెను ఆసుపత్రికి కాకుండా ఆమెతో పాటు మండపేటకు చెందిన కె.కృష్ణవేణి తదితరులను అమానవీయంగా బస్సులలో ఎక్కించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సత్తెనపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వేమగిరికి చెందిన అంగన్‌వాడీ బేబీరాణి, మరి కొందరిని పోలవరం, బుట్టాయగూడెం ప్రాంతాలకు తరలించారు. యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మొబైల్‌ను లాక్కున్నారు. ఆమె అప్పటికే తన మొబైల్‌లో పోలీసుల దురుసు ప్రవర్తనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేయడంతో సమాజానికి చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా అంతటా నిరసనలతో దద్దరిల్లింది. కాకినాడలోని సుందరయ్య భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాల్లోనూ, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద మానవహారం, ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు.

యాప్‌లతో పని భారం

కేంద్ర ప్రభుత్వ యాప్‌ పోషణ ట్రాకర్‌లో వివిధ శాఖల వివరాలు నమోదు చేయడం కష్టతరంగా మారుతోంది. నెట్‌వర్క్‌ సరిగా లేకపోవడం, సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ఫేస్‌ రిజిస్ట్రేషన్‌ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజంతా ఈ యాప్‌ల నమోదుతోనే సరిపోతుంది. ఇది కాకుండా అంగన్‌వాడీ సెంటర్‌లో పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేయవలసి రావడంతో అంగన్‌వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

వేతనాలు పెంచాలి

రాజమహేంద్రవరం అర్బన్‌ పరిధిలో 400 మంది, రూరల్‌ పరిధిలో 250 మంది అంగన్‌వాడీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారు. తక్షణ ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది..

2000 మార్చి 30న హైదరాబాద్‌లో ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది. బాష్పవాయువు ప్రయోగించారు. ఆ ఉద్యమంలో మండపేట నియోజకవర్గానికి చెందిన అంగన్‌వాడీ గాయాలపాలైంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే సమయంలోనూ అంగన్‌వాడీలపై లాఠీ చార్జి చేయించారు.

గెలిస్తే జీతాలు పెంచుతానన్న జగన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అంగన్‌వాడీల వేతనాలను రూ.11,500కు పెంచారు. తన పాలనాకాలంలో సమ్మె చేసిన అంగన్‌వాడీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలను రూ.లక్షకు పెంచుతూ జీవో జారీ చేశారు. 2024లో అధికారంలోకి వస్తే 2024 జూన్‌ నుంచి వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని ప్రలోభ పెట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాకా అంగన్‌వాడీలపై దమణకాండకు పాల్పడ్డారు.

దగాకోరు హామీలు ఇక చెల్లవు

నాడు గుర్రాలతో తొక్కించి..

నేడు పోలీసులతో ఈడ్పించారు

మహిళా దినోత్సవానికి ముందు

మంచి బహుమతే ఇచ్చారు

అంగన్‌వాడీల అణచివేతపై

ఉమ్మడి జిల్లా నాయకుల ఆగ్రహం

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తాం

చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అంగన్‌వాడీలపై దాడికి దిగుతున్నారు. 2000లో హైదరాబాద్‌లో గుర్రాలతో తొక్కించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో అక్రమంగా అరెస్టు చేయించారు. ప్రస్తుత ఉద్యమంలో చర్చలు జరుపుతున్నట్టు నటిస్తూ అర్ధరాత్రి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చి తీరుతాం.

– జి.బేబీరాణి, అధ్యక్షురాలు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement