వాట్సాప్ గ్రూపుల్లో
పది పరీక్షల ఛీప్‌లు, డీవోల వివరాలు
బాలాజీచెరువు (కాకినాడ): ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బంది కేటాయింపులన్నీ రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచే చేపట్టారు. పక్కాగా పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఎవరూ ఏ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారో ముందుగా బయటకు తెలియకుండా ఉండేందుకు ఈ విధానం అవలంబించారు. నేరుగా సదరు ఉపాధ్యాయుల మొబైల్‌కే ఎక్కడ విధులు నిర్వహించాలన్న సమాచారం ఇస్తారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులుగా నియమితులైనవారికి మంగళవారం ఉత్తర్వులందాయి. అత్యంత గోప్యంగా పేర్కొంటూ పనిచేసే పాఠశాల, కేటాయించిన పరీక్ష కేంద్రం, ఫోన్ నంబర్ వివరాలన్నీ గోప్యంగా డీఈఓ కార్యాలయం లాగిన్‌కు పంపారు. ఇంతవరకూ బాగానే ఉన్న కార్యాలయంలో కొందరు సిబ్బంది ఈ వివరాలను బయటకు పంపడంతో ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో ఈ వివరాలు హల్‌చల్ చేస్తున్నాయి.
దూరంగా విధులు
ఉపాధ్యాయులు పనిచేసే స్థానం నుంచి పది కిలోమీటర్ల లోపు ఉన్న కేంద్రంలో విధులు కేటాయించాలి. కానీ కొందరిని దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్లకు పైబడి దూరంలో ఉన్న కేంద్రాలకు డ్యూటీలు వేశారు. చాలామంది ఉపాధ్యాయులకు ఈ విధంగా దూరంగా వేయడంతో ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన పరీక్షలు ప్రారంభం కానున్నాయి.


