చంద్రగ్రహణం ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చంద్రగ్రహణం ఎఫెక్ట్‌

Mar 4 2026 7:49 AM | Updated on Mar 4 2026 7:49 AM

ఈ ఆలయానికి మినహాయింపు

అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఉదయం పూజల అనంతరం ఆయా ఆలయాలను మూసివేశారు. అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని ఉదయం 10 గంటలకు మూసివేశారు. అంతకు ముందు స్వామి, అమ్మవార్లకు అర్చకులు లఘు పూజ నిర్వహించారు. అనంతరం ఈఓ వి.త్రినాథరావు ఆధ్వర్యాన ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు సుధీర్‌, దత్తాత్రేయశర్మ తదితరుల సమక్షంలో సెక్యూరిటీ సిబ్బంది స్వామివారి ప్రధానాలయాన్ని, తూర్పు, పశ్చిమ రాజగోపురాల ద్వారాలను మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ ద్వారాలకు నోటీసులు అతికించారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలు నిర్మాన్యుషంగా దర్శనమిచ్చాయి. దేవస్థానంలోని వివిధ కౌంటర్లు, దుకాణాలను కూడా మూసివేశారు. గ్రహణం కారణంగా ఉదయం భక్తులు కూడా చాలా తక్కువగా వచ్చారు. సత్యదేవుని వ్రతాలు సుమారు వంద జరిగాయి. ముందుగా ప్రకటించిన విధంగా ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే సత్యదేవుని వ్రతాలు నిర్వహించారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్య కల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయించారు. భక్తులను స్వామివారి దర్శనాలను ఉదయం 10 గంటల వరకూ అనుమతించారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా ఆయుష్య హోమాన్ని ఉదయం 7 గంటలకే ప్రారంభించి, 9.30 గంటల్లోగా ముగించారు. సత్యదేవుని నిత్య కల్యాణం కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభించి 9.30 గంటలకు పూర్తి చేశారు. సత్యదేవుని ప్రధానాలయంతో పాటు స్వామివారి యంత్రాలయం, రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ తల్లి ఆలయాలను కూడా ఉదయం 10 గంటలకే మూసివేశారు. గ్రహణానంతరం ఆలయాలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, బుధవారం ఉదయం నుంచి స్వామి, అమ్మవార్ల దర్శనాలు, వ్రతాలు, ఇతర కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తామని ఈఓ తెలిపారు.

పంచారామ క్షేత్రం మూసివేత

సామర్లకోట: చంద్రగ్రహణం సందర్భంగా పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని ఉదయం 10 గంటలకు మూసివేశారు. పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు ఆధ్వర్యాన శ్రీచక్ర పండితుడు వేమూరి సోమేశ్వరశర్మ, అభిషేక పండితుడు అళ్లకి రాజ్‌గోపాల్‌శర్మ, ప్రధానార్చకుడు సన్నిధిరాజు వెంకట రమణలు తెల్లవారుజామునే స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, ఉపాలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ బళ్ల నీలకంఠం, చైర్మన్‌ కంటే జగదీష్‌ మోహన్‌ల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన ద్వారానికి తాళం వేశారు. బుధవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఈఓ తెలిపారు. దూర ప్రాంతాల నుంచి బస్సులలో వచ్చిన భక్తులకు చంద్రగ్రహణం కారణంగా స్వామివారిని దర్శించే అవకాశం లభించలేదు. పట్టణంలోని నూకాలమ్మ, వేణుగోపాలస్వామి, జగదీశ్వరస్వామి ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు.

ఫ జిల్లాలో ఆలయాల మూసివేత

ఫ నేటి ఉదయం నుంచి తిరిగి దర్శనాలు

పిఠాపురం: గ్రహణం వేళ రాష్ట్రంలో దాదాపు అన్ని దేవాలయాలూ మూసివేయడం పరిపాటి కాగా.. పిఠాపురం పాదగయ క్షేత్రంలో మాత్రం ఆలయం తెరిచే ఉంచడం విశేషం. ఇక్కడ వెలసిన కుక్కుటేశ్వరస్వామి వారికి మంగళవారం చంద్రగ్రహణ సమయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు, పురోహితులు జపాలు చేశారు. పలువురు భక్తులు గ్రహణ సమయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటిపర్తిలో అపర్ణాదేవి ఆలయ అర్చకులు గ్రహణ సమయంలో తమ ఇంట్లో రోకలి నిలబెట్టి జపాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement