పెరుగుతున్న మరణాలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న మరణాలు

Mar 4 2026 7:49 AM | Updated on Mar 4 2026 7:49 AM

సామర్లకోట: వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌లో శనివారం జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. సంఘటన జరిగిన రోజున అక్కడిక్కడే 20 మంది సజీవ దహనం కాగా, సామర్లకోట కుమ్మర వీధికి దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అదే ప్రాంతానికి చెందిన వేమగిరి లోవరాజు (35) కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో, ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. లోవరాజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి అతడి భార్య బుజ్జిని బంధువులు కాకినాడ జీజీహెచ్‌కు తీసుకువెళ్లారు. అతడు మరణించాడని వైద్యులు చెప్పడంతో అనారోగ్యంతో ఉన్న బుజ్జిని సాయంత్రం ఆరు గంటల సమయంలో తిరిగి ఇంటికి తీసుకు వచ్చారు. ఇంటికి వచ్చిన వెంటనే కుప్ప కూలిపోయి బుజ్జి రోదించిన తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. ఆమె ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. భర్త లేని తాను ఎందుకు బతకాలంటూ ఆమె గుండెలు బద్దలయ్యేలా విలపించింది. పలు కుటుంబాల్లో పెను విషాదం నింపిన ఈ పేలుడు ఘటనలో సామర్లకోట కుమ్మర వీధికే చెందిన ఐదుగురు మృతి చెందడంతో ఆ ప్రాంత ప్రజల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఏం చేయాలో

అర్థం కావడం లేదు

కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాను. నా భర్త లోవరాజు పదేళ్లుగా బాణసంచా తయారీలో కష్టపడి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన రెక్కల కష్టంతోనే ఇటీవల మా కుమార్తె రాజీ పెళ్లి చేశాం. మా ఇద్దరు కుమారులు బద్రి, నానిలకు ఇంకా ఉద్యోగాలు లేవు. పని చేసే పరిశ్రమే నా భర్తను తీసుకుపోయింది. మా కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. ఆరోగ్యం బాగోలేని నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే నా పిల్లలకు దారి చూపాలి.

– బుజ్జి, వేమగిరి లోవరాజు భార్య, సామర్లకోట

ఫ వేట్లపాలెం పేలుడు

ఘటనలో మరొకరి మృతి

ఫ 23కు చేరిన మృతులు

ఫ మరో ఆరుగురి పరిస్థితి విషమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement