బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలెక్టర్ షణ్మోహన్‌ను కాకినాడలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి, పింఛను సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలిచి, అవసరమైన అన్ని సహాయ సహకారాలూ అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డోకుబుర్ర భద్రం మాస్టారు తదితరులు పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల
సంఘానికి నూతన కార్యవర్గం
కాకినాడ లీగల్: జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం, సబ్ రిజిస్ట్రార్ల సంఘం కార్యవర్గ సభ్యుల ఎన్నిక రాజమహేంద్రవరంలో మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. అమలాపురం జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2 పి.లక్ష్మణ్‌రాజు ఎలక్షన్ అబ్జర్వర్‌గా వ్యవహరించారు. ఎన్నిక అనంతరం సబ్ రిజిస్ట్రార్ల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 14న రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక విశాఖపట్నంలో జరుగుతుందని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ల సంఘం జిల్లా ఈసీ సభ్యులుగా రాయుడు వెంకట రామారావు (కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1), టి.సుబ్బారెడ్డి (తుని), బీవీవీ సత్యనారాయణ (సామర్లకోట), పీవీవీఎస్ వీరభద్రరావు (కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్–2) ఎన్నికయ్యారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వైవీవీ సురేష్ (సీనియర్ అసిస్టెంట్, కాకినాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం), ఉపాధ్యక్షుడిగా ఎస్.నరసింహారావు (జానియర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం), ప్రధాన కార్యదర్శిగా ఎస్.భాస్కర్‌రెడ్డి (జూనియర్ అసిస్టెంట్, తాళ్లరేవు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం), సంయుక్త కార్యదర్శిగా పి.గణేష్ కుమార్ (జానియర్ అసిస్టెంట్, జగ్గంపేట), కోశాధికారిగా కేవీ ప్రసాద్ (సీనియర్ అసిస్టెంట్, సర్పవరం), మహిళా ప్రతినిధిగా సీహెచ్ అనూష (జూనియర్ అసిస్టెంట్, సర్పవరం), ఈసీ సభ్యులుగా జేయూ సామ్రాట్ (జానియర్ అసిస్టెంట్, కాకినాడ), పి.శాలినీదేవి (జూనియర్ అసిస్టెంట్, కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాయలం), వి.స్రవంతి (ఆఫీస్ సబార్డినేట్, సామర్లకోట) ఎన్నికయ్యారు.


