కనీస వేతనం ఇచ్చేంత వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం ఇచ్చేంత వరకూ పోరాటం

Mar 4 2026 7:49 AM | Updated on Mar 4 2026 7:49 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అంగన్‌వాడీ ఉద్యోగులకు రూ.26 వేల కనీస వేతనం ఇచ్చేంత వరకూ పోరాటం ఆగదని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అన్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ స్థానిక కచేరీపేట సుందరయ్య భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఇంద్రపాలెం లాకుల వద్ద రహదారి దిగ్బంధం చేసి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ, ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలను చర్చలకు పిలిచి, అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వస్తే అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతామంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నారన్నారు. హక్కుల కోసం పోరాడుతూంటే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అరెస్టు చేసిన అంగన్‌వాడీ నాయకులను వెంటనే విడుదల చేయాలని, లేకుంటే యూనియన్‌ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీల ఆందోళనకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర నాయకురాలు సీహెచ్‌ రమణి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు టేకుముడి ఈశ్వరరావు, రిటైర్డ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement