సదస్సులో చాగంటి కోటేశ్వరరావు
రాజమహేంద్రవరం రూరల్: ముందు మన నుంచే మార్పు వస్తే, సమాజం మారుతుందని ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నైతిక విద్యా సదస్సు నిర్వహించారు. దీనిని చాగంటి కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకి మనం కట్టుబాటుతో బతకడం అనేది కేవలం విద్యతో మాత్రమే వస్తుందన్నారు. సెల్‌ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక సామాజిక దుష్ప్రభావాలను వివరించి, సమయాన్ని వృఽథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. నైతిక విలువలు లేని ఏపనైనా విషంతో సమానమని స్పష్టం చేస్తూ, సత్యం, క్రమశిక్షణ, గౌరవం, సేవాభావం వంటి సద్గుణాలు ప్రతి విద్యార్థి జీవితానికి పునాది కావాలని తెలిపారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానలిచ్చారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ ఈ ప్రవచనాలను విద్యార్థులు పెద్దవారైనా పాటించాలన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ సదస్సులో తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్‌పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్‌బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, దాదాపు 1,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.


