ఒకరి మృతి
పెరవలి: ఉసులుమర్రు వద్ద గ్యాస్ సిలిండర్ల ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరవలి పోలీస్ స్టేషన్ ఏఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం.. నిడదవోలుకు చెందిన అంగర కృష్ణ ధనప్రసాద్ (38) అక్కడి హెచ్‌పీ గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్లతో ఆటోను కానూరు తీసుకొచ్చి వినియోగదారులకు పంపిణీ చేసి, అనంతరం ఉసులుమర్రు వచ్చారు. అక్కడ సిలిండర్లు దింపి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ నేపథ్యంలో ఆటో బోల్తా పడింది. రోడ్డుపై పడిపోయిన ధనప్రసాద్‌పై గ్యాస్ సిలిండర్లు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని హుటాహుటిన నిడదవోలులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని భార్య సాయి రామతులసి ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉదయం వరకూ కళ్లముందే తిరుగాడిన వ్యక్తి సాయంత్రానికి అచేతనంగా మారడంతో బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. రామతులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు.
యువకుడి దుర్మరణం
అమలాపురం టౌన్: స్థానికంగా సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన రేవు దినేష్‌కుమార్ (27) బైక్ వెళ్తుండగా, స్థానిక ఎత్తు రోడ్డులోని హెచ్‌పీ గ్యాస్ గొడౌన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి రాజోలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతని బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని రాంగ్ రూట్‌లో వెళుతున్న దినేష్ కుమార్ ఈ ప్రమాదానికి గురైనట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దినేష్ కుమార్ కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరి పిల్లలతో అమలాపురం పట్టణం నారాయణపేటలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


