రైతు ఆత్మహత్యలపై ఎందుకు మాట్లాడలేదు?
● అసెంబ్లీలో పబ్లిసిటీ కోసమే
లడ్డూ కల్తీ డ్రామాలు
● మాజీ మంత్రి కురసాల కన్నబాబు
కాకినాడ రూరల్: దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి.. నాలుగోసారి సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు కౌలు రైతుల గురించి ఎంత అవగాహనతో మాట్లాడారనేది అసెంబ్లీలో ఆయన మాటలను బట్టే అర్థమవుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్‌తో కలసి కాకినాడలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులు 30, 40 ఎకరాలు కౌలు చేస్తే మార్కెటింగ్ ఎలాగని అనడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. కూలీ అని కాకుండా రైతు అనిపించుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని కష్టజీవులు.. భార్యాభర్తలిద్దరూ పని చేసుకునే వారు కౌలు చేస్తారని అన్నారు. కానీ, కౌలు రైతులే సమస్య అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారని ఆక్షేపించారు. వ్యవసాయం మీద చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతున్నారంటే చాలా ఆసక్తిగా చూశానని, కానీ ఏమీ మాట్లాడలేదని, దీనినిబట్టి రాష్ట్రంలోని రైతులకు ఏమీ చేయలేదని ఆయన ఒప్పుకున్నట్టేనని అన్నారు. మార్కెటింగ్, రైతు సంక్షేమం, ఫెసిలిటీ గురించి మాట్లాడకపోవడం వైఫల్యం కిందే లెక్కన్నారు. కన్నబాబు ఇంకా ఏమన్నారంటే..
392 మంది రైతుల ఆత్మహత్య
చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం 2025లో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని బట్టి వ్యవసాయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ రంగాన్ని దుర్మార్గంగా గాలికొదిలేసి, ఈవేళ కోకో సిటీ తెస్తాను, కాఫీ టౌన్ కడతాను, మీరు వాణిజ్య పంటలే పండించండని చెబుతున్నారు. రాష్ట్రంలోని 80 లక్షల ఎకరాల్లో రెండు పంటలు వరి పండిస్తారు. ఆ వరి రైతుల గురించి గానీ, 393 మంది రైతుల ఆత్మహత్యల గురించి గానీ చంద్రబాబు ఒక్క ముక్క మాట్లాడలేదు.
కల్తీ అని కట్టుకథలు
రైతుల పరిస్థితి బాగోలేదన్నా.. ఏం అడిగినా తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిసిందని, ఆరోగ్యశ్రీని గాలికొదిలేశారంటే తిరుపతి లడ్డూలో చేప నూనె కలిసిందని, కల్తీ అని కట్టు కథలు, పిట్ట కథలతో చంద్రబాబు గడిపేస్తున్నారు. రాజమహేంద్రవరంలో పాల కల్తీతో ఆరుగురు, శ్రీకాకుళంలో నీళ్ల కల్తీతో నలుగురు చనిపోయారు. దీనినిబట్టి ఎంత కల్తీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అర్థం చేసుకోవాలి. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలపై చంద్రబాబుకు పట్టు పోయింది. ఒక్క శాఖ కూడా సక్రమంగా నడవడం లేదు. జగన్‌ను దుమ్మెత్తి పోయడమే ఫెర్మార్మెన్స్‌గా చూడటంతో పరిపాలనను గాలికి వదిలేశారు.
పురందేశ్వరి మాటలు సిగ్గుచేటు
రాజమండ్రి ఎంపీ, చంద్రబాబు కుటుంబ సభ్యురాలు పురందేశ్వరి సీనియర్ నాయకురాలు. పాల కల్తీపై ప్రభుత్వం సకాలంలో స్పందించిందని ఆమె అభినందించడం సిగ్గుచేటు. చనిపోయిన వారికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వడమే ప్రభుత్వం స్పందించడమా? చావుల దగ్గర కూడా పొగుడుకుంటూ మాట్లాడుతున్నారంటే ప్రజలు ఏమనుకుంటారోననే పట్టింపు కూడా లేదన్నమాట.
పాల కల్తీ జరిగి జనం చనిపోవడం మీరు విన్నారా? నీళ్ల కల్తీ, పాల కల్తీ జరుగుతూంటే మీరు వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. పాల కల్తీ జరిగి, జనం చనిపోయే సమయానికి శాసన సభ్యులు కబడ్డీ ఆడుతున్నారు. శ్రీకాకుళంలో నీళ్ల కల్తీ జరిగి జనం చనిపోయే టైమ్‌కు శాసన సభ్యులు క్రికెట్ ఆడుతున్నారు. మీరు సంతోషంగా ఆటపాటలతో గడుపుతున్నారు. ప్రభుత్వమైనా వేగంగా స్పందించడం లేదు. ఈ సంవత్సరం ఆటలు, పాటలు, గత సంవత్సరం నాటకాలు.
భారతి సిమెంట్‌పై చర్చ చాలా
చిత్రంగా ఉంది
హౌసింగ్‌పై చర్చ సందర్భంగా భారతి సిమెంట్ ఎక్కువ కొనేశారని చెబుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉండగా పేదల ఇళ్లు, ప్రాజెక్ట్‌ల కోసం సిమెంట్ ప్రొక్యూర్ చేయాలని నిర్ణయించి, అన్ని సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపారు.
ఆ రోజు బస్తా సిమెంట్ రూ.380 అమ్ముతుండగా రూ.235కు ఇవ్వాలని ఒప్పించారు. 1,19,43,237 మెట్రిక్ టన్నుల సిమెంట్ నాడు డిమాండ్ ఉండగా కొన్ని కంపెనీలు గిట్టుబాటు కాదన్నాయి. పీపీసీ రూ.225, రూ.235కు ఇచ్చేందుకు ఫిక్స్ చేశారు. 2015–16 నుంచి 2019–20లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే సమయానికి కంటే ఇది తక్కువ ధర. దీనివలన ప్రభుత్వానికి మంచే జరిగింది. దానిని వదిలేసి, భారతి సిమెంట్‌కు సప్లయ్ ఇచ్చేశారంటూ చర్చ పెట్టడమేమిటి?
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం
అందరికీ తెలుసు
‘తమ్ముళ్లూ నేను ఎప్పుడైనా మోసం చేశానా?’ అని చంద్రబాబు అడిగినట్టు సోషల్ మీడియాలో చూశాను. ఆ సభలో ఒక్కరైనా కాదంటూ చెయ్యి ఊపారా? చంద్రబాబు రాజకీయ ప్రస్థానం ప్రజలకు తెలుసు. మోసం చేశారో లేదో ఎన్టీఆర్ నుంచి మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీరు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారో లేదో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆడబిడ్డలకు సీ్త్రశక్తితో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చానని, అయినా సభకు రాలేదని చంద్రబాబు అంటున్నారు. కౌన్సిల్‌లో లడ్డూపై చర్చ పెట్టకుండా పారిపోతున్నారు.
జగన్‌ను తగ్గించి చూపాలని కుట్ర
రాష్ట్రంలో మతం అనే అస్త్రాన్ని వాడి జగన్‌మోహన్‌రెడ్డిని తగ్గించి చూపేందుకు రాజకీయ కుట్ర చేస్తున్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ప్రచారం మొదలు పెట్టారు. అది ఇవాళ చంద్రబాబు మెడకే చుట్టుకుంది. వేంకటేశ్వరస్వామితో రాజకీయం చేశారు. ఈ పాపం ఊరికే పోదు. చార్జిషీట్‌లోని అంశాలను వక్రీకరించి చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో తీసిన శాంపిల్స్, రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు తిరిగి మళ్లీ లోపలకు వెళ్తే జగన్ హయాంలో తప్పు జరిగినట్టు చూపడం ఎంతవరకూ న్యాయం? పాలు, నెయ్యి, పెరుగు వ్యాపారం మీ చేతుల్లోనే కదా ఉన్నాయి.
సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ గురించి మా నాయకుడు పేర్ని నాని చెబితే తెల్లారేసరికి రంగులు వేశారు. సున్నం కొడితే నిజాలు మారిపోతాయా? సీబీఐ కన్నా సీబీఎన్ గొప్ప అని మీ మైండ్‌లో పడిపోయింది. లెంపలేసుకుని క్షమాపణలు చెబితే స్వామి వారు క్షమిస్తారు. సీబీఐ రిపోర్టును వక్రీకరించి అసెంబ్లీలో చెబుతున్నారు.
జంతువుల కొవ్వు లేదని రిపోర్టుల్లో స్పష్టంగా ఉన్నా ఇంకా బుకాయిస్తున్నారు. ఇందాపూర్‌పై చర్చకు రమ్మన్నా కౌన్సిల్‌లో రాలేకపోతున్నారు. లడ్డూ మీద మాట్లాడదామన్నా కౌన్సిల్‌కు రారు. హెరిటేజ్ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌గా ఇందాపూర్ డెయిరీ 2026 ఫిబ్రవరి 15న కో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌గా ఎలా మారిందో, ఎందుకు మారిందో చంద్రబాబు సమాధానం చెబుతారా? 2026 ఫిబ్రవరి 14న హెరిటేజ్ ఫుడ్స్ నేషనల్ సేల్స్ హెడ్‌గా ఉన్న మకరంద్ శాస్త్రి ఎందుకు రాజీనామా చేశారు? చంద్రబాబు 2015లో అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఇందాపూర్ డెయిరీ నుంచి కిలో నెయ్యి రూ.278కి కొన్నది నిజమా? అబద్ధమా? 2016 మార్చి 18న ఇది ల్యాబ్ రిపోర్టులో రిజెక్ట్ అయ్యిందా? లేదా? రిజెక్ట్ అయినప్పుడు మళ్లీ మూడు నెలలకే అనుమతించడంలో ఆంతర్యమేమిటి? హెరిటేజ్‌కు కో మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌గా ఉన్న ఇందాపూర్‌కు టెండర్ ఎలా ఖరారు చేశారో చెప్పాలి. మీ దగ్గర బ్రాండ్ తప్ప మాన్యుఫ్యాక్చరింగ్ లేదు. చట్టసభల సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు.


