గౌరవం ఏదీ?
● స్థానిక ప్రజాప్రతినిధులకు వేతన యాతన
● గౌరవ వేతనం చెల్లించని ప్రభుత్వం
● రూ.కోట్లలో బకాయిలు
● త్వరలో ముగియనున్న పదవీ కాలం
● అయినా స్పందించని సర్కారు
● మండిపడుతున్న ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలి. ఎన్నికలై ఫలితాలు వచ్చేశాక పార్టీలను పక్కన పెట్టి అందరినీ ఒకే రీతిన చూడాలి. కానీ చంద్రబాబు గద్దెనెక్కాక మండల, జిల్లా పరిషత్ ప్రజాప్రతినిధులకు వేతనాలు ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
గౌరవ వేతనాలు ఇలా..
మండల సమావేశాలు, ఇతర కార్యక్రమాల ఖర్చుల నిమిత్తం గౌరవ వేతనంగా ఎంపీటీసీ సభ్యులకు నెలకు రూ.3 వేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు రూ.6 వేల వంతున ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మేరకు మండల, జెడ్పీ వార్షిక బడ్జెట్లలో నిధులు కేటాయిస్తూంటారు. ఎప్పటికప్పుడు గౌరవ వేతనం కోసం బిల్లులు పెడితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూంటుంది. మండల, జెడ్పీ సమావేశాల్లో సభ్యులకు ఈ గౌరవ వేతనం అందజేస్తూంటారు. ఉమ్మడి జిల్లాలో 61 మంది జెడ్పీటీసీ సభ్యులు, 980 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఇతర ప్రజాప్రతినిధులుగా 90 శాతం పైగా స్థానాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, సానుభూతిపరులే విజయం సాధించారు. 2021 సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన వీరి పదవీ కాలం త్వరలో ముగియనుంది. అయినప్పటికీ వీరికి ఇప్పటి వరకూ బకాయి వేతనాలు విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.
రెండేళ్లుగా..
గత సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి సాంకేతిక కారణాలతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల చెల్లింపును అధికారులు నిలిపివేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయ్యాయి. ఈ కాలంలో 6 నెలల వేతనాలు మాత్రమే విడుదల చేసింది. మిగిలిన 12 నెలల గౌరవ వేతనం ఇప్పటి వరకూ విడుదల చేయలేదు. దీనిపై జెడ్పీ సర్వసభ్య సమావేశాలు జరిగిన ప్రతిసారీ జెడ్పీటీసీ సభ్యులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఎంపీపీలకు కారు అలవెన్స్ మాత్రం చెల్లిస్తూండగా గౌరవ వేతనం మాత్రం చెల్లించడం లేదు. ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు ఒక్కొక్కరికి రూ.1.44 లక్షలు, ఎంపీటీసీ సభ్యులకు రూ.72 వేల చొప్పున ప్రభుత్వం గౌరవ వేతన బకాయిలు పెట్టింది. ఈవిధంగా జిల్లాలో రూ.కోట్లలోనే బకాయిలు పేరుకుపోయాయి.
బిల్లులు పెడుతున్నా..
గౌరవ వేతనాలకు సంబంధించిన నిధుల విడుదల కోసం మండల, జెడ్పీ అధికారులు బిల్లులు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. గత్యంతరం లేక స్థానిక ప్రజాప్రతినిధులు సొంత సొమ్ము వెచ్చించి సమావేశాలకు హాజరవుతున్నారు. మెజార్టీ సభ్యులు వైఎస్సార్ సీపీకి చెందిన వారు అయినందువల్లనే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గౌరవ వేతనం బకాయిలు విడుదల చేయడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వేతన బకాయిలపై ఇటీవల కాకినాడలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులందరూ మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేశారు. వారిని జిల్లా అధికారులు బుజ్జగించి వెనక్కు తీసుకువచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విడుదల చేయకపోవడం విచిత్రం. దీనిపై పలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో ఎంపీటీసీ సభ్యులు సైతం నిలదీస్తున్నా, నిరసనలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.
జెడ్పీలో అడుగుతున్నా దిక్కు లేదు
గౌరవ వేతనాల కోసం జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో సభ్యులందరం పదేపదే అడుగుతున్నాం. ఇప్పటికే నాలుగైదుసార్లు మూకుమ్మడిగా వాకౌట్ చేశాం. కొంత మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు మద్దతుగా నిలిచారు. అప్పటికప్పుడు జిల్లా అధికారులు ఏదో ఒక హామీ ఇచ్చి ఆ తరువాత గాలికొదిలేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే ఎందుకంత పక్షపాతమో అర్థం కావడం లేదు. గౌరవ వేతన బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. ప్రజల ద్వారా ఎన్నికై న స్థానిక సంస్థల సభ్యులకే ప్రభుత్వం గౌరవం ఇవ్వకుంటే ఇక మిగిలిన వారికి ఏముంటుంది?
– ఉలవకాయల లోవరాజు,
జెడ్పీటీసీ సభ్యుడు, గొల్లప్రోలు
తీర్మానాలు చేశాం..
వేచి చూస్తున్నాం
గౌరవ వేతనాల కోసం జెడ్పీ సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు తరచూ అడుగుతున్నారు. వారికి బకాయిలున్న మాట వాస్తవమే. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు గౌరవ వేతనాల విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై సభలో కూడా పలు సందర్భాల్లో సభ్యుల సమక్షంలోనే చర్చించాం. దాదాపు ఏడాదిన్నర పైనే పేరుకుపోయిన బకాయిల కోసం జెడ్పీలో తీర్మానాన్ని ఆమోదించి ప్రభుత్వానికి పంపించాం. బకాయిల విడుదల కోసం ఎదురు చూస్తున్నాం.
– విప్పర్తి వేణుగోపాలరావు,
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్
గౌరవం ఏదీ?
గౌరవం ఏదీ?


