త్వరలో ఎస్‌ఐఆర్‌ | - | Sakshi
Sakshi News home page

త్వరలో ఎస్‌ఐఆర్‌

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

త్వరలో ఎస్‌ఐఆర్‌

త్వరలో ఎస్‌ఐఆర్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ త్వరలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ప్రారంభం కానున్నదని డీఆర్‌ఓ పి.తిప్పేనాయక్‌ తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ జిల్లాలో సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని కోరారు. వివిధ పార్టీలు బూత్‌ ఏజెంట్లను తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు. దీనికోసం బీఎల్‌ఏ–2 ఫామ్‌లో వివరాలు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్‌ కేంద్రాల్లో 16,48,436 మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు, కొత్త ఓటు నమోదు వంటి అంశాలపై ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈ నెల 26వ తేదీ వరకూ ఫామ్‌ 6, 7, 8కు సంబంధించి 1,818 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వీటన్నింటినీ నిర్దిష్ట సమయంలోగా పరిష్కరిస్తామన్నారు. ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. పోలింగ్‌ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనంలోకి మార్చేందుకు ప్రతిపాదిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,640 పోలింగ్‌ కేంద్రాలున్నాయని, హేతుబద్ధీకరణ ప్రకారం అదనంగా 183 కొత్త కేంద్రాలు రానున్నాయని డీఆర్‌ఓ వివరించారు.

భార్య మృతికి కారకుడైన

భర్తకు జీవిత ఖైదు

కాకినాడ లీగల్‌: కట్నం కోసం వేధించి, భార్య మృతికి కారకుడైన భర్తకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన అనసూరి వెంకట రమణతో కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల గుబ్బలవారిపాలేనికి చెందిన కట్టా పద్మలక్ష్మికి గతంలో వివాహం జరిగింది. అనంతరం వారు కాకినాడ రూరల్‌ సర్పవరంలో కాపురం ఉండేవారు. వివాహ సమయంలో ఐదు కుంచాల పొలం, రూ.1.50 లక్షల నగదు, 2 కాసుల బంగారం, మోటార్‌ సైకిల్‌ కట్నంగా ఇచ్చారు. వివాహమైన అనంతరం కట్నం తక్కువ ఇచ్చారంటూ రమణ తన భార్యను వేధించేవాడు. మరో మహిళతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. 2011 అక్టోబర్‌ 31న పద్మలక్ష్మిని హతమార్చాడు. దీనిపై పద్మలక్ష్మి తండ్రి కట్టా సత్యనారాయణ ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రమణపై నేరం రుజువైంది. అదనంగా డబ్బులు డిమాండ్‌ చేసినందుకు మూడేళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా, హత్య చేసినందుకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. రెండు శిక్షలూ ఏకకాలంలో అమలు చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement