పాపాల వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

పాపాల వ్యాపారం

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

పాపాల

పాపాల వ్యాపారం

పిఠాపురం: తెల్లనివన్నీ పాలు కాదని అంటారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే ఇది నిజమనిపించక మానదు. పసి పిల్లల నుంచి పెద్దల వరకూ నిత్యం ఉపయోగించే పాలల్లో కొందరు వ్యాపారులు ఎన్నో విధాలుగా కల్తీకి పాల్పడుతున్నారు. వివిధ రకాల పదార్థాలు, రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడటం అందరికీ తెలిసిందే. కానీ, లాభార్జనే ధ్యేయంగా కొంత మంది స్వార్థపరులు పాడి పశువుకు నేరుగా ప్రమాదకర ఇంజెక్షన్‌ ఇస్తూ కూడా కొంత మంది పా‘పాల’ వ్యాపారం చేస్తున్నారు.

ఎప్పుడు వాడతారంటే..

పశువులు ఈనే సమయంలో పరిస్థితి ప్రమాదకరంగా మారినప్పుడు, ఈనిన తరువాత మాయ వేయలేనప్పుడు, గర్భసంచిని సరిదిద్దడానికి పొదుగు వాపులో పాలు రానప్పుడు, ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ వాడుతూంటారు. దీనివలన రెండు నుంచి ఆరు నిమిషాల్లో జీవక్రియ జరుగుతుంది. అలాగే, చేపునకు రావడంతో పాడి పశువు అధికంగా పాలు స్రవిస్తుంది.

ఎన్నో దుష్పరిణామాలు

ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ. వాస్తవానికి ఇది ఒక హార్మోన్‌ అని పశువైద్యులు చెబుతున్నారు. దీనిని ప్రతి రోజూ వాడటం వలన పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి. పశువు ఎదకు వచ్చినా చూలు నిలబడదు. పైగా గర్భస్రావం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి. మరోవైపు ఈ ఇంజెక్షన్‌ వాడిన పశువు నుంచి తీసుకున్న పాలు తాగిన వారిలోనూ అనేక దుష్పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్లో వినికిడి, దృష్టి లోపాలు వస్తూంటాయి. శరీరంలో శక్తి నశించి తొందరగా అలసటకు గురవుతారు. చంటి పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. బాలింతల్లో హైపర్‌ సెన్సిటివ్‌ రియాక్షన్‌ రావచ్చు. ఈ ఇంజెక్షన్‌ వాడిన పశువు పాలు తాగడం వల్ల ఆడ పిల్లలు చిన్న వయసులోనే ప్రౌఢ దశకు చేరుకుంటారు. ఈ ఇంజెక్షన్‌ను 1960లోనే ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టు యానిమల్స్‌ యాక్టు ప్రకారం ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు పాల వ్యాపారులు అధిక పాల దిగుబడి కోసం వీటిని అక్రమంగా రైతులకు సరఫరా చేస్తున్నారు.

ఇలా చేస్తే ఇంజక్షన్‌తో పని లేదు

పశువులకు మేపులో పౌష్టిక దాణాలు, ఖనిజ లవణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. పశువులు ఆరోగ్యంగా ఉంటాయని పశు వైద్యులు చెబుతున్నారు. అజోల్లా వంటి ఆరోగ్యకరమైన మేతలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వాటిని రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. అనేక ప్రాంతాల్లో పోషణపై శ్రద్ధ చూపకపోవడం వల్ల 30 శాతం దూడలు చనిపోతున్నాయి. దూడ లేకపోతే తల్లి పశువు పాలు ఇవ్వదు. పాడి రైతులు పశువులకు అలవాటు చేసిన ప్రకారం పాల చేపు వస్తుంది. ముందుగా దూడతో తాగించి, తరువాత పాలు తీస్తే.. అదే అలవాటవుతుంది. అందువలన దూడ లేకపోతే పాలు చేపునకు రావు. అలా కాకుండా ముందుగా పాల గిన్నెల శబ్దాలు అలవాటు చేయడంతో పాటు ముందు పాలు పితికి.. ఆ తరువాత దూడలకు పాలు వదలాలి. అలా చేస్తే దూడ లేకపోయినా పశువులు చేపునకు వస్తాయని పశు వైద్యులు చెబుతున్నారు.

వైద్యుల సలహాతోనే...

కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రమే ఆక్సిటోసిన్‌ ఇంజెక్షన్‌ వాడాలి. అది కూడా వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ ఇంజెక్షన్‌ పశువులకే కాదు.. ఆ పాలు తాగే మనుషులకూ ప్రమాదకరం. అందుకే దీనిని నిషేధించారు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దీనిని అమ్మినా, కొన్నా నేరమే అవుతుంది. ఈనే సమయంలో పశువుకు ఇబ్బందులు ఏర్పడినా, పాలు ఇచ్చేందుకు అనుకూలత లేకపోయినా దీనిని డాక్టర్ల సూచనల మేరకు మాత్రమే ఉపయోగించాలి. ఎన్నో దుష్పరిణామాలున్న ఈ ఇంజెక్షన్‌ వాడకుండా రైతుల్లో అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.

– పి.కృష్ణమూర్తి,

జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి

పాల చేపునకు ఆక్సిటోసిన్‌

ఇంజెక్షన్ల వాడకం

దీనివలన ఆ పశువుకు,

ఆ పాలు తాగే వారికి ప్రమాదం

నిషేధిత ఇంజెక్షన్లు వాడరాదని

పశు వైద్యుల హెచ్చరికలు

పాపాల వ్యాపారం1
1/1

పాపాల వ్యాపారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement