మినీ.. ఏదీ మనీ! | - | Sakshi
Sakshi News home page

మినీ.. ఏదీ మనీ!

Feb 27 2026 4:17 AM | Updated on Feb 27 2026 4:17 AM

మినీ.. ఏదీ మనీ!

మినీ.. ఏదీ మనీ!

పిఠాపురం మండలం రాపర్తిలో గోకులం షెడ్‌

మినీ గోకులాల పేరిట సర్కారు ఆర్భాటం

షెడ్ల నిర్మాణానికి 90 శాతం

రాయితీ ఇస్తామని హడావుడి

పాడి రైతులు 10 శాతం

ఖర్చు చేస్తే చాలని ప్రకటన

ఆ మాటలు నమ్మి నిర్మించుకున్న రైతులు

నెలలు గడుస్తున్నా విడుదల కాని బిల్లులు

గగ్గోలు పెడుతున్న లబ్ధిదారులు

పిఠాపురం: పాడి పరిశ్రమకు వైభవం తెస్తాం.. రైతుకు అండగా ఉంటాం.. భారీ రాయితీతో మినీ గోకులం షెడ్లు నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు తెగ ఆర్భాటం చేశారు. నిజమేననుకుని ఆ బుట్టలో పడిన పాడి రైతులు చేతి చమురు వదిలించుకుని, అప్పులు చేసి మరీ షెడ్లు నిర్మించుకున్నారు. నెలలు గడుస్తున్నా వారికి రాయితీ ఇవ్వకుండా సర్కారు చుక్కలు చూపిస్తోంది.

నిర్మాణం ఇలా..

రైతుకు పాడి, పంట రెండు కళ్ల లాంటివి. తమకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడే పాడి పశువులను అన్నదాతలు కన్నబిడ్డల్లా సాకుతారు. అటువంటి పశువుల పోషణ, రక్షణకని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో మినీ గోకులం షెడ్లు మంజూరు చేసింది. ఈ పథకం ద్వారా పశువులకు రేకుల షెడ్లు నిర్మించేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో పశు సంవర్ధక శాఖతో పాటు నిధుల మంజూరుకు ఉపాధి హామీ పథకం అధికారులను భాగస్వాముల్ని చేసింది. పశువుల సంఖ్యను బట్టి గోకులం షెడ్ల నిర్మాణానికి వెసులుబాటు కల్పించింది. ఆవులు, గేదెలు రెండు కానీ ఉంటే రూ.1.15 లక్షలు, నాలుగు ఆవులు, గేదెలు ఉంటే రూ.1.66 లక్షలు, 6 గేదెలు, ఆవులు ఉంటే రూ.2.30 లక్షల చొప్పున, 20 గొర్రెలుంటే రూ.1.30 లక్షలు, 50 గొర్రెలకు రూ.2.30 లక్షలు, వంద కోళ్ల పెంపకానికి రూ.87 వేలు, 200 కోళ్ల పెంపకానికి రూ.1.32 లక్షల చొప్పున షెడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఇందులో లబ్ధిదారు అయిన రైతు 10 శాతం చెల్లిస్తే చాలు.. మిగిలిన 90 శాతం ప్రభుత్వమే చెల్లించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు హడావుడి చేసింది. ఈ మాటలు నమ్మిన పలువురు రైతులు సొంత డబ్బులు వెచ్చించి, కొంత మంది వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ ఈ షెడ్లు నిర్మించుకున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కూటమి కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు కూడా వచ్చాయి.

వదిలిపోయిన చేతిచమురు

పశువుల సంఖ్యను బట్టి ఒక్కో లబ్ధిదారుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.80 లక్షల వరకూ ఖర్చయ్యింది. ఈ షెడ్లను త్వరగా నిర్మించాలంటూ అప్పట్లో అధికారులు ఒత్తిడి తేవడంతో పలువురు అప్పులు చేసి మరీ వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేశారు. ఈ మినీ గోకులం షెడ్లను గత ఏడాది జనవరిలో కూటమి ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రారంభించారు. లబ్ధిదారులతో ఫొటోలకు పోజులిచ్చారు. గోకులం షెడ్లు నిర్మించుకున్న వారు తమ వాటాగా 10 శాతం సొమ్మును డీడీ రూపంలో ప్రభుత్వానికి ముందుగానే అందజేశారు. కానీ, ప్రభుత్వం మాత్రం తాను ఇస్తానన్న 90 శాతం రాయితీని ఇప్పటి వరకూ ఇవ్వలేదు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో షెడ్లు నిర్మించుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇటు అధికారులు, అటు కూటమి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి, తిరిగి కొత్త అప్పుల పాలవుతున్నామంటూ పాడి రైతులు గగ్గోలు పెడుతున్నారు.

జిల్లాలో మినీ గోకులం షెడ్ల వివరాలు

మంజూరు : 1,380

నిర్మాణ వ్యయం : రూ.30 కోట్లు

ఇప్పటి వరకూ పూర్తయినవి : 1,055

బిల్లు బకాయిలు : రూ.11 కోట్లకు పైగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement