పనులు వేగవంతం చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ –1, 2లో భాగంగా జిల్లాలో చేపట్టిన పనులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై డ్వామా, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద సమకూరిన నిధులతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనులు చేపట్టామని చెప్పారు. పల్లెపండుగ–1, పల్లెపండుగ–2 కింద చేపట్టిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ డ్రైన్ల పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ పనులను మార్చి 15 నాటికి నూరు శాతం పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ ఏవీఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
రేపు పింఛన్ల పంపిణీ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను శనివారం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జిల్లాలో 2,68,958 మందికి రూ.117.02 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
పోగొట్టుకున్న బంగారు
ఆభరణాల అందజేత
గోకవరం: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న సుమారు 6 కాసుల బంగారు ఆభరణాలను ప్రయాణికురాలికి గోకవరం ఆర్టీసీ డిపో అధికారులు అందజేశారు. డిపో మేనేజర్ సుచరిత మార్గరేట్ కథనం ప్రకారం.. గోకవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు సర్వీసు గురువారం ఉదయం గోకవరం నుంచి రంపచోడవరం బయలుదేరింది. బస్సు రంపచోడవరం వెళ్లిన తరువాత ఓ ప్రయాణికురాలికి సీటు వద్ద పర్సు లభించింది. ఆమె ఆ పర్సును బస్సు కండక్టర్ ఏపీ శర్మ, డ్రైవర్ శేషగిరికి అప్పగించింది. వారు పర్సు తెరచి చూడగా సుమారు 6 కాసుల బంగారు ఆభరణాలు, రూ.420 నగదు, ఆధార్ కార్డు, బస్సు టికెట్టును గుర్తించారు. వారు ఆ పర్సును గోకవరం ఆర్టీసీ డిపోలోని అధికారులకు అప్పగించారు. పర్సు పోగొట్టుకున్న ప్రయాణికురాలిని మడకం అమ్మాజీగా గుర్తించారు. వెంటనే ఆమెకు సమాచారం అందించి గోకవరం ఆర్టీసీ బస్టాండ్‌లో డీఎం చేతుల మీదుగా ఆమెకు పర్సును అప్పగించారు. నిజాయితీ చాటిన కండక్టర్ ఏసీ శర్మ, డ్రైవర్ శేషగిరిని డీఎం, ఇతర సిబ్బంది అభినందించారు.
పనులు వేగవంతం చేయాలి


