లండన్‌లో పెద్దాపురం యువకుడి సజీవ దహనం
కాకినాడ క్రైం/సామర్లకోట: ఇంగ్లండ్ దేశ రాజధాని లండన్‌లో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువకుడు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు. లండన్ ఫైర్ బ్రిగేడ్, మెట్రోపాలిటన్ పోలీసుల కథనం మేరకు, పెద్దాపురానికి చెందిన గొంతి అభిషేక్(26) ఏ232 క్రోయిడాన్ ఫ్‌లైఓవర్ పక్కనే ఉన్న ఓ రెండు అంతస్తుల భవనంలో వాటిల్లిన అగ్ని ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదం ఈ నెల 23 తెల్లవారుజామున 1.30 సమయంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే చనిపోగా మరో భారతీయ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే భవంతిలో కింది అంతస్తులో ఉన్న మరో విదేశీ యువకుడు అగ్నికీలల్ని గుర్తించి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన సౌత్ లండన్ అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున 2.47 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. యువకుల నివాసం అధిక భాగం చెక్కతో నిర్మితం కావడం ప్రమాద తీవ్రతను పెంచిందని తెలిపారు. అభిషేక్ మూడేళ్ల క్రితం హోం సైన్స్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగం చేస్తున్నాడు. అభిషేక్ తండ్రి ఆస్కార్‌రావు ఏలూరు జిల్లా అగిరిపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఉద్యోగ వేదిక చైర్మన్‌గా, ఏపిజీఈఏ జనరల్ సెక్రటరీగా, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కీలక హోదాల్లో పనిచేశారు. ఆస్కార్‌రావు, రాధిక దంపతుల ఏకై క కుమారుడు అభిషేక్, ఇతడికి ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరిలో షమీమా కెనడాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. షకీనా వైద్యురాలిగా విజయవాడలో పనిచేస్తున్నారు. కుమారుడి మృతి నేపథ్యంలో ఆస్కార్‌రావుకి పలువురు ఉద్యోగులు, అధికారులు సానుభూతి తెలిపారు. అభిషేక్ మృతదేహం దేశానికి చేరేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
లండన్‌లో పెద్దాపురం యువకుడి సజీవ దహనం


