ఇంటర్ సెకండియర్ పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, సంస్కృతం పరీక్షలకు 18,380 హాజరు కాగా 382 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,343 మంది పరీక్షలు రాయగా 42 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి కేశవరావు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు.
రేపటి నుంచి
సీ పోర్టు రోడ్డు మూసివేత
కాకినాడ రూరల్: కాకినాడ డీప్ వాటర్ పోర్టు (సీ పోర్టు) నాలుగో గేటు – కుంభాభిషేకం ఆలయం మధ్య ఏడీబీ రోడ్డుపై (ఎన్‌హెచ్–216ఎఫ్) లెవెల్ క్రాసింగ్ గేట్ మేజర్ మరమ్మతులు, ట్రాక్ రిపేర్లు చేపడుతున్నారు. ఈ దృష్ట్యా గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు సీ పోర్టు మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 నుంచి శనివారం సాయంత్రం 7 గంటల వరకూ మరమ్మతులు చేపడుతున్నందున ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లిస్తామన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.
పారిశుధ్య కార్యక్రమాలు
పక్కాగా చేపట్టాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, వీధిలైట్లు, అన్నా క్యాంటీన్లు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్ల పక్కన ఎప్పటి నుంచో ఉండిపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సూచించారు. రోజువారీ పారిశుధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పర్యవేక్షించాలన్నారు. వెలగని వీధి లైట్ల స్థానంలో వెంటనే కొత్తవి వేయాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై కూడా అధికారులు సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు.
కల్తీ పాల బాధితులకు
వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
సాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితులను వైఎస్సార్ సీపీ నేతల బృందం మంగళవారం పరామర్శించింది. చికిత్స పొందుతున్న కిమ్స్, రెయిన్‌బో తదితర ఆస్పత్రులకు వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారు.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధితుల కుటుంబాలను పలకరించారు. ఎలాంటి సమయంలోనైనా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా పోరాటం చేస్తామన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు
ఎక్స్‌గ్రేషియా అందజేత
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పాల కల్తీ కారణంగా మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించామని కలెక్టర్ కీర్తి తెలిపారు. మంగళవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆనాల ఎన్‌క్లేవ్ వద్ద తాడి కృష్ణవేణి, తాడి రమణిలకు సంబంధించిన రూ.20 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, లాలాచెరువు గ్లో గార్డెన్ సమీపంలో మృతుడు నీలా శేషగిరిరావు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందించారు.


