అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు వేగవంతం చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపట్టిన తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, మార్చి 5 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 125 అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు, 101 కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. గతంలో ప్రారంభించి, ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న 155 అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించేందుకయ్యే వ్యయం, చేపట్టాల్సిన పనుల వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్ జనరల్ విభాగంలో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒకేషనల్ జీఎఫ్‌సీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 20,104 మంది హాజరవగా 670 మంది గైర్హాజరయ్యారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోలేదు. తొలి రోజు 24 పరీక్ష కేంద్రాలను స్క్వాడ్స్ తనిఖీ చేశాయి. ఆరు కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షించాయి. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఆయా కేంద్రాల గేట్లను ఉదయం 9 గంటలకే మూసివేశారు. కాకినాడ ఆర్‌ఐఓ వి.కేశవరావు నగరంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు జ్యోతుల రాంబాబు, డీవీకే వర్మ, వి.శ్రీనివాస్‌లు కాకినాడ రూరల్‌తో పాటు పలు కేంద్రాలను పర్యవేక్షించారు.
తలుపులమ్మ తల్లికి రూ.46.21 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.46,21,025 ఆదాయం లభించిందని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్ నాయుడు పర్యవేక్షణలో దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. మొత్తం 66 రోజులకు గాను నాణేలు రూ.3,07,475, నోట్లు రూ.43,13,550 వచ్చాయని ఈఓ వివరించారు. హుండీల ఆదాయం లెక్కింపులో శ్రీవారి సేవకులు, బ్యాంకు సిబ్బంది, నాయీ బ్రాహ్మణులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
భాషల్లో ప్రావీణ్యం అవసరం
కాకినాడ రూరల్: ప్రతి విద్యార్థికి తెలుగు, ఇంగ్లిషు, హిందీతో పాటు ఇతర భాషల్లో ప్రావీణ్యం అవసరమని జిల్లా ఉప విద్యాశాఖాధికారి కేవీవీ సత్యనారాయణ అన్నారు. రమణయ్యపేటలోని ఏపీఎస్పీ బెటాలియన్ జెడ్పీ హైస్కూలులో జిల్లా స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ మండల స్థాయిలో నిర్వహించిన లాంగ్వేజ్ ఫెస్టివల్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు జిల్లా స్థాయి ఫెస్టివల్‌లో అవకాశం కల్పించారు. కథా వచనం, వ్యాస రచన, పద్య పఠనం, వక్తృత్వం తదితర పోటీల్లో 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ కె.జోగిరెడ్డి, ఎంఈఓ శ్రీనివాస కుమార్, హెచ్‌ఎం సత్యవోలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫెస్టివల్‌కు 80 మంది గైడ్ టీచర్లు కూడా హాజరయ్యారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు వేగవంతం చేయాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు వేగవంతం చేయాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పనులు వేగవంతం చేయాలి


