గోల్డ్ బాండ్ స్కీమ్‌కు సత్యదేవుని బంగారం
ఫ 9.646 కిలోల ముడి బంగారం అప్పగించిన దేవస్థానం
ఫ దీనిని కరిగించగా వచ్చిన మేలిమి
బంగారం స్కీమ్‌లో జమ
ఫ దీనిపై దేవస్థానానికి బంగారం రూపంలో 0.3 శాతం వడ్డీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి చెందిన 9.646 కేజీల ముడి బంగారాన్ని అధికారులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గోల్డ్ బాండ్ స్కీమ్‌లో డిపాజిట్ చేశారు. ఈ మేరకు ఈ బంగారాన్ని విశాఖపట్నంలోని ఎస్‌బీఐ అధికారులకు సోమవారం అప్పగించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి భక్తులు వివిధ కానుకల రూపంలో బంగారాన్ని హుండీల్లో సమర్పిస్తూంటారు. అలాగే, కొంతమంది చిన్నచిన్న కానుకల రూపంలో స్వామి, అమ్మవారి అలంకరణ నిమిత్తం బంగారాన్ని అధికారులకు అందజేస్తారు. వీటిలో స్వామి, అమ్మవారి అలంకరణకు అవసరమైన వాటిని ఉంచి, మిగిలిన వాటిని బ్యాంక్ లాకర్లలో దేవస్థానం భద్రపరుస్తుంది. ఆవిధంగా భద్రపరచిన బంగారాన్ని గోల్డ్ బ్యాండ్ స్కీమ్‌కు అప్పగించారు. ఈ బంగారాన్ని ప్రభుత్వ మింట్‌లో దేవస్థానం అధికారుల సమక్షంలో కరిగించారు. ఆభరణాల్లోని వివిధ పొడులు, రాళ్లు తొలగించారు. మిగిలిన నికర బంగారాన్ని కడ్డీలో రూపంలో తయారు చేసి, దీనిపై ఏటా బంగారం రూపంలో 0.3 శాతం వడ్డీని ఎస్‌బీఐ అందజేస్తుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే 32 కేజీల బంగారం
ఇప్పటికే అన్నవరం దేవస్థానానికి చెందిన 32 కేజీల బంగారాన్ని గోల్డ్ బాండ్ స్కీమ్‌లో డిపాజిట్ చేశారు. చివరిగా 2018 జూలైలో ఎం.జితేంద్ర ఈఓగా ఉన్న సమయంలో 672.33 కిలోల వెండిని కరిగించారు. దీనిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఏడు కిలోల బంగారాన్ని కొనుగోలు చేసి, ఇదే విధంగా గోల్డ్ బాండ్ స్కీమ్‌లో డిపాజిట్ చేశారు. దీనిపై దేవస్థానానికి ఏటా బంగారం రూపంలో వడ్డీ జమ అవుతోంది. ఈ స్కీమ్ వలన దేవస్థానానికి లాభమని అధికారులు చెప్పారు. ఈ బంగారాన్ని ఇప్పటి వరకూ లాకర్లలో ఉంచడం వలన బ్యాంకుకు అద్దె చెల్లించాల్సి వచ్చేదని, ఇకపై ఆ భారం తప్పుతుందని తెలిపారు. పైగా, దేవస్థానానికి వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ ఎల్.శ్రీనివాస్, స్టేట్ బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.


