విద్యార్థీ.. విజయోస్తు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నా యి. వచ్చే నెల 24 తేదీ వరకూ ఈ పరీక్షలు నిర్వ హించనున్నారు. తొలి రోజు ఫస్టియర్, ఆ మర్నాడు అంటే మంగళవారం సెకండియర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష పేపర్లను ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచి, సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఉదయం 8.30 గంటలకు పోలీస్ స్టేషన్ నుంచి పేపర్లు తీసుకుని వచ్చి, 8.45 గంటలకు తెరుస్తారు. పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్ష పత్రాలను ఆయా కేంద్రాలకు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ‘నో యువర్ సెంటర్’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఆర్‌ఐఓ ఐ.శారద వ్యవహరిస్తారు. జిల్లా స్థాయి కమిటీ కన్వీనర్‌గా జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి (డీఐఈఓ) వి.కేశవరావు ఉంటారు. ఈయన జిల్లాలో పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారు. హాల్ టికెట్ల విషయంలో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసి, విజయం సాధించాలని ఆకాంక్షించారు.
కొత్త విధానంలో..
ఈసారి ఇంటర్ పరీక్షల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. ఫస్టియర్ విద్యార్థులకు కొత్త విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రథమ సంవత్సరం బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు 24 పేజీలు, మిగిలిన సబ్జెక్టులకు 32 పేజీలతో కూడిన బుక్‌లెట్లు ఇస్తారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మాత్రం అన్ని సబ్జెక్టులకూ పాత విధానంలోనే 24 పేజీల బుక్‌లెట్ ఇవ్వనున్నారు. బుక్‌లెట్లలో అన్ని పేజీలూ ఉన్నాయో లేదో విద్యార్థులు ముందుగానే చూసుకోవాలి. పేజీలను చించితే ఆ విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేస్తారు. ఇప్పటి వరకూ జువాలజీ, బోటనీ సబ్జెక్టులకు చెరొక 60 మార్కుల చొప్పన థియరీ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది రెండింటికీ కలిపి బయాలజీ పేరుతో 85 మార్కులకు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ఒక్కటే అయినప్పటికీ జవాబులు రాసేందుకు మాత్రం రెండు సబ్జెక్టులకు రెండు ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. ఈ ఏడాది తొలిసారిగా ఒక్క మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టారు. గణితంలో 12, బోటనీలో 5, జువాలజీలో 4, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో చెరొక 9 చొప్పున ఒక్క మార్కు ప్రశ్నలు ఇవ్వనున్నారు.
పాస్ మార్కులు ఇలా..
ఏ సబ్జెక్టుకైనా ఉత్తీర్ణత శాతం 35. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు ప్రథమ సంవత్సరంలో 85కు 29, ద్వితీయ సంవత్సరంలో 85కు 30 మార్కులు కచ్చితంగా రావాలి. ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తూండగా పాస్ మార్కులు 11 రావాలి.
టైమ్ టేబుల్‌లో మార్పులు
వచ్చే నెల 3న జరగాల్సిన సెకండియర్ మ్యాథ్స్, సివిక్స్ పరీక్షలు 4న, మార్చి 20న జరగాల్సిన ఫస్టియర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పరీక్ష 21న నిర్వహించనున్నారు. మార్చి 3న హోలీ, మార్చి 20న రంజాన్ రావడంతో ఈ మార్పులు చేశారు.
నిఘా నీడలో..
పరీక్షలు నిఘా నీడలో నిర్వహించనున్నారు. పరీక్షలు జరుగుతున్నంతసేపూ ఆయా కేంద్రాల్లో ప్రతి కదలికనూ నిశితంగా పరిశీలించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి(ఆర్‌ఐఓ)తో పాటు బోర్డు కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. తద్వారా పరీక్షల నిర్వహణను లైవ్(ప్రత్యక్ష ప్రసారం)లో పరిశీలిస్తారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి జిల్లావ్యాప్తంగా 42,873 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం జిల్లా అంతటా కలిపి 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా కాకినాడ నగరంలో 19 వేల మంది వరకూ విద్యార్థులుండగా వీరి కోసం నగరం, రూరల్ ప్రాంతాలు కలిపి 24 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ప్రైవేటు కేంద్రాలపై పర్యవేక్షణకు అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. రాష్ట్ర బృందంతో పాటు ఐదుగురు సభ్యులున్న జిల్లా కమిటీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్, పోలీసులతో కూడిన మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లతో పాటు జిల్లా హైపవర్ కమిటీ ఈ పరీక్షలను పర్యవేక్షించనుంది.
ఫోన్లపై నిషేధం
పరీక్షా కేంద్రంలో సూపరింటెండెంట్ సహా కింది స్థాయి సిబ్బంది వరకూ ఏ ఒక్కరూ ఎటువంటి వ్యక్తిగత ఫోన్లూ వాడకూడదు. బోర్డు సమకూర్చిన ఫోన్, సిమ్ కార్డులు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మట్టికుండలో తాగునీరు ఏర్పాటు చేయాలి. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
కాకినాడ పీఆర్ కళాశాలలో పరీక్ష నిర్వహణకు సిద్ధం చేసిన గది
జిల్లాలో పరీక్షల నిర్వహణ ఇలా..
ప్రభుత్వ కళాశాలలు 15
హైస్కూల్ ప్లస్ 14
మోడల్ స్కూల్ 2
కేజీబీవీ 4
ఏపీఎస్‌డబ్ల్యూఆర్ 8
ప్రైవేట్ ఎయిడెడ్ 4
ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 99
మొత్తం 146
ఫస్టియర్ విద్యార్థులు 22,009
సెకండియర్ విద్యార్థులు 20,864
మొత్తం 42,873
పరీక్ష కేంద్రాలు 58
ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 3
కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్లు
90635 53377, 98493 92905
రాష్ట్ర స్థాయి టోల్‌ఫ్రీ నంబరు 1800–425–1531
అరగంట ముందే రావాలి
ఉదయం 9 గంటలకు పరీక్ష కచ్చితంగా ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమ పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి. మూడు గంటల పరీక్షా సమయంలో గతంలో మాదిరిగా అరగంట ముందుగా బయటకు వచ్చేసే వెసులుబాటును రద్దు చేశారు. కాబట్టి విద్యార్థి పూర్తిగా 12 గంటల వరకూ పరీక్ష గదిలోనే ఉండాలి. సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఆన్‌లైన్ కేంద్రాల వంటివి తెరవరాదని స్పష్టంగా సూచించాం.
– వి.కేశవరావు, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
వచ్చే నెల 24వ తేదీ వరకూ నిర్వహణ
జిల్లావ్యాప్తంగా 58 కేంద్రాలు
అరగంట ముందే
బయటకు వచ్చే వీలు రద్దు
ఫస్టియర్ విద్యార్థులకు
32 పేజీల బుక్‌లెట్
విద్యార్థీ.. విజయోస్తు


