లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 16 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,86,020, పూజా టికెట్లకు రూ.2,57,000, తలనీలాలకు రూ.15,200, వాహన పూజలకు రూ.7,460, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.65,805, విరాళాలు రూ.31,301 కలిపి మొత్తం రూ.5,62,786 ఆదాయం సమకూరిందని వివరించారు. దేవస్థానంలో హుండీలను సోమవారం తెరచి ఆదాయాన్ని లెక్కించనున్నట్టు ఈఓ తెలిపారు.
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
కాకినాడ క్రైం: వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. సత్ప్రవర్తనతో మెలగాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని, గొడవలు, దాడులు, భూ వివాదాలకు దూరంగా ఉండాలని, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు దిగకూడదని, మద్యం తాగి అల్లర్లు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
బాలాజీకి
రూ.2.14 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దర్శనానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారికి ముడుపులు, మొక్కులు చెల్లించారు. గోవిందా గోవిందా అంటూ బాలబాలాజీ దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని తన్మయులయ్యారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,14,453 ఆదాయం వచ్చింది. మొత్తం 6,300 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. అన్నప్రసాదం 2,100 మంది స్వీకరించారు. నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.88,463 విరాళాలు అందించారు.
ఏకదంతుని దర్శనానికి
తండోపతండాలు
అయినవిల్లి: భక్తుల కోర్కెలు తీర్చే అయినవిల్లి గణపయ్యను దర్శించేందుకు ఆదివారం భక్తజ నం తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వ ర్యంలో స్వామికి తెల్లవారుజామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. స్వామి వారిని ఆర్చకులు పరిమళభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. రాత్రి 8 గంటలకు స్వామికి విశేష సేవలు చేసిన అనంతరం ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. భక్తదంపతులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. స్వామికి నలుగురు భక్త దంపతులు ఉండ్రాళ్ల పూజ చేశారు. ఓ చిన్నారికి నామకరణ, ఎనిమిది మందికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరు చిన్నారులకు తులాభారం, 52 మందికి అన్నప్రాశన నిర్వహించారు. వాహన పూజలు 58 మంది చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 5,218 మంది భక్తులు స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
లోవకు పోటెత్తిన భక్తులు
లోవకు పోటెత్తిన భక్తులు


