మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తుని రూరల్: హంసవరంలోని ఆదర్శ విద్యాలయం(ఏపీ మోడల్ స్కూల్)లో వచ్చే విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ టీవీ శివలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. ఓసీ, బీసీ విద్యార్థులు 2014 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీల మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే 2012 సెప్టెంబర్ 1 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ మధ్య పుట్టిన వారు అర్హులు. సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024–25, 2025–26 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. 2026లో ఐదో తరగతి చదువుతూ ప్రమోషన్‌కు అర్హత పొందాలి. దరఖాస్తు చేయడానికి ముందు సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా ఏపీఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్లలో సమాచార పత్రం పొందాలి. అర్హులైన అభ్యర్థులు సోమవారం నుంచి మార్చి 31వ తేదీలోగా నెట్ బ్యాంకింగ్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించిన తర్వాత కేటాయించిన జర్నల్ నంబరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీలు రూ.125 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి. ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీలు 30, ఓసీ, బీసీ అభ్యర్థులు 35 చొప్పున మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఐదో తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఆరో తరగతిలో బోధన మాత్రం ఇంగ్లిషు మీడియంలో ఉంటుంది. మరిన్ని వివరాలకు పని వేళల్లో పాఠశాల కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రిన్సిపాల్ శివలక్ష్మి సూచించారు.
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శించుకున్నారు. ఆదివారం సెలవు కావడంతో వీరికి ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తోడయ్యారు. దీంతో, ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉదయం 9 గంటల వరకూ రద్దీ ఓ మాదిరిగా ఉండగా.. ఆ తరువాత ఒక్కసారిగా వచ్చిన భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. భక్తుల వాహనాలతో ఘాట్ రోడ్లు, పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి 2 గంటలు, రూ.200 టికెట్టుతో జరిగే అంతరాలయ దర్శనానికి గంట చొప్పున సమయం పట్టింది. స్వామివారి నిత్య కల్యాణంలో 25 మంది భక్తులు పాల్గొన్నారు. సుమారు 40 వేల మంది భక్తులు ఆలయానికి తరలి వచ్చారని, దేవస్థానానికి రూ.40 లక్షలకు పైగా ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున కూడా రత్నగిరిపై వివాహాలు జరగనున్నాయి. దీంతో, ఆలయంలో సోమవారం కూడా రద్దీ నెలకొనే అవకాశం ఉంది.


