మహిళలపై పెరిగిన అత్యాచారాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో పసి పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకూ మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) జిల్లా నాయకురాలు రెడ్డి దుర్గాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాలు, పోర్న్ వెబ్‌సైట్ల నియంత్రణలో పాలకులు దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సంఘం ఆధ్వర్యాన మార్చి 2 నుంచి 8వ తేదీ వరకూ నిర్వహించే సభలు, ర్యాలీల పోస్టర్‌ను ఆమె స్థానిక సూర్యనారాయణపురంలో ఆదివారం ఆవిష్కరించారు. మార్చి 2న రంగంపేట మండలం సింగంపల్లి, 3న రంపచోడవరం, 4న పెద్దాపురం, 6న జగ్గంపేట, 7న కాకినాడ, 8న రాజమహేంద్రవరం తదితర కేంద్రాల్లో నిర్వహిస్తున్న సభలు, ర్యాలీలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తోందని, ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అని దుర్గాదేవి అన్నారు. రాష్ట్రంలో మద్యం వ్యాపారులు అధికార పార్టీ అండదండలతో బెల్టు షాపులు నిర్వహించి, విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని చెప్పారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాల నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తోందని, మనువాద భావజాలాన్ని ముందుకు తెస్తూ మహిళలను తిరోగమనం దిశగా నడిపిస్తోందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పలువురు పాల్గొన్నారు.


