వ్యాపారులపై వడ్డన | - | Sakshi
Sakshi News home page

వ్యాపారులపై వడ్డన

Feb 21 2026 7:36 AM | Updated on Feb 21 2026 7:36 AM

వ్యాప

వ్యాపారులపై వడ్డన

కాకినాడలో ట్రేడ్‌ లైసెన్స్‌

ఫీజు భారీగా పెంపు

నగర పాలక సంస్థ నిర్ణయం

అనుమతించిన ప్రభుత్వం

అసలే మందగించిన వ్యాపారాలు

ఈ తరుణంలో ఇవేం

వడ్డింపులంటూ వ్యాపారుల మండిపాటు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అసలే గతంలో మాదిరిగా చేతిలో తగినంత సొమ్ము లేక, కొనుగోలు శక్తి పడిపోయి ప్రజలు సతమతమవుతున్నారు. ఫలితంగా దాదాపు అన్ని రకాల వ్యాపారాలు మందగించాయి. సంక్రాంతి సీజన్‌లో రెండు మూడు వారాలు మినహా మిగిలిన రోజుల్లో వ్యాపారాలు సక్రమంగా జరగక వ్యాపారులు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి తరుణంలో మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన.. కాకినాడ నగరంలో వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతించే ట్రేడ్‌ లైసెన్సు ఫీజును ప్రభుత్వం భారీగా పెంచేసింది. తద్వారా వ్యాపారులపై పెను భారం మోపింది. ముఖ్యంగా ఈ పెంపు చిరు వ్యాపారులకు గుదిబండగా మారుతోంది. పెంచిన ట్రేడ్‌ లైసెన్సు ఫీజును చెల్లించలేమని, అడ్డగోలుగా, అనాలోచితంగా చేసిన పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వ్యాపార ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమస్యపై దశల వారీ ఆందోళనకు సైతం వెనుకాడేది లేదని వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి.

గతంలో తిరస్కరించిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

అధికారుల లెక్కల ప్రకారం కాకినాడ నగరంలో ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లింపుదారులు 6,700 మంది వరకూ ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ అంతకు రెట్టింపు సంఖ్యలో వ్యాపారాలు జరుగుతున్నాయన్నది అంచనా. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు ద్వారా నగర పాలక సంస్థకు రెండు మూడు లక్షల రూపాయలు అటూ ఇటుగా రూ.కోటి వరకూ ఆదాయం వస్తోంది. ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజును 2011 తరువాత ఇప్పటి వరకూ పెంచిన దాఖలాల్లేవు. వాస్తవానికి నగర పాలక సంస్థలు ఆదాయాన్ని పెంచుకునేందుకు మూడేళ్లకోసారి 25 శాతం వరకూ ట్రేడ్‌ లైసెన్సు ఫీజు పెంచుకునే వెసులుబాటు ఉంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఫీజు పెంపునకు అధికారులు ప్రతిపాదనలు చేశారు. అయితే, వ్యాపారులకు భారం అవుతుందనే ఉద్దేశంతో నాటి ప్రభుత్వం లైసెన్స్‌ ఫీజు పెంచకుండా నిలిపివేసింది.

నేడు చంద్రబాబు సర్కారు అనుమతి

తమను అధికారంలోకి తీసుకువస్తే ఏ వర్గం పైనా భారం పడకుండా చూస్తామని, సంపద సృష్టిస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అండ్‌ కో గొప్పలకు పోయారు. అటువంటిది ఇప్పుడు నాలుక మడత పెట్టేసి ట్రేడ్‌ లైసెన్సు ఫీజు పెంచడం ఎంతవరకూ సమంజసమని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నగరపాలక సంస్థకు ఏటా వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటోందనే కారణంతో ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో కుళాయి పన్ను, ట్రేడ్‌ లైసెన్సు ఫీజు పెంపునకు ప్రభుత్వం అనుమతించింది. గతంలో చదరపు అడుగులు ప్రామాణికంగా లైసెన్సు ఫీజు ఉండేది. ప్రస్తుతం చదరపు మీటర్ల ప్రకారం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించారు. దీనివలన వ్యాపారులపై తలకు మించిన భారం పడుతోంది. సంపద సృష్టించడమంటే ప్రజలపై భారాలు మోపడమా అని వ్యాపార వర్గాలు మండిపడుతున్నాయి.

భారీగా భారం

ఇప్పటి వరకూ చిరు వ్యాపారులు రూ.400 నుంచి రూ.500 వరకూ ట్రేడ్‌ లైసెన్సు ఫీజు చెల్లిస్తున్నారు. తాజా పెంపుతో ఇది ఏకంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెరుగుతోంది. ట్రేడ్‌ లైసెన్సు ఫీజు రెట్టింపవుతోందని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వచ్చి చెబుతూంటే సైకిల్‌, మోటార్‌ సైకిల్‌ మెకానిక్‌లు, కిళ్లీ షాపులు, రోడ్డు పక్కన చిన్నచిన్న బడ్డీల్లో టీ అమ్ముకునే చిరు వ్యాపారులు దిగులు చెందుతున్నారు. ఇదివరకు మాదిరిగా వ్యాపారాలు సాగడం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు పెంచడంలో ఔచిత్యమేమిటని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో వారి అవసరాన్ని అవకాశంగా చేసుకుని లైసెన్స్‌ ఫీజు తగ్గించేలా చూస్తామంటూ కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉపసంహరించుకోవాలి

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజు ఒకేసారి అన్ని రెట్లు పెంచడం అన్యాయం. ఇది చిరు వ్యాపారుల నడ్డి విరిచే నిర్ణయం. లైసెన్స్‌ ఫీజు పదిహేనేళ్లుగా పెంచడం లేదు. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా పెంచడం దుర్మార్గం. అసలే వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్న వ్యాపారులకు ఇది పిడుగుపాటు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.

– తాటిపాక మధు, సీపీఐ

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ

ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు పెంచారిలా (రూ.లలో)

గతంలో ఫీజు ఇకపై చెల్లించాల్సింది

400 – 500 1,000

1,000 2,000 – 3,000

1,500 3,000

2,000 4,000 – 5,000

3,000 5,000

5,000 10,000

బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు గతంలో

రూ.10 వేల నుంచి సుమారు రూ.15 వేల వరకూ ఉండేది. దీనిని ఏకంగా రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచారు.

వ్యాపారులపై వడ్డన1
1/1

వ్యాపారులపై వడ్డన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement