ఎట్టకేలకు కొత్త సత్రం నిర్మాణం
● 22న శంకుస్థాపన
● 105 గదులతో నిర్మాణం
● అదే రోజు రత్నగిరి రెండో
మెట్లదారి ప్రారంభం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఎట్టకేలకు కొత్త సత్రం నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శిథిలావస్థకు చేరిన పాత సీతారామ సత్రం స్థలంలో కొత్త సత్రం నిర్మాణానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ నెల 22న శంకుస్థాపన చేయనున్నారు. దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు ఈ విషయం తెలిపారు. అదే రోజు రత్నగిరి టోల్‌గేట్ నుంచి కొండ పైకి రూ.90 లక్షలతో నిర్మించిన రెండో మెట్ల దారిని కూడా ప్రారంభించనున్నారు.
గత ప్రభుత్వ హయాంలోనే..
రత్నగిరిపై సుమారు 30 ఏళ్ల కిందట నిర్మించిన శ్రీ సీతారామ సత్రం శిథిలావస్థకు చేరిందని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2024లో గుర్తించారు. ఈ సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని అప్పటి దేవస్థానం ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆర్‌అండ్‌బీ అధికారులను కోరారు. వారు ఈ సత్రాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని అప్పట్లోనే నివేదిక ఇచ్చారు. ఆ మేరకు 2024 మే నెలలో సీతారామ సత్రం భవనాన్ని కూల్చివేసి, సగం స్థలంలో ఎ–బ్లాక్ పేరిట 105 గదులతో కొత్త సత్రం నిర్మించేందుకు రూ.8.82 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. దీనిని 19.80 శాతం తక్కువకు అంటే సుమారు రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్‌స్ట్రక్షన్స్ దక్కించుకుంది. పాత సత్రాన్ని కూల్చివేసి ఇనుము, కలప తీసుకుని, మిగిలిన రద్దు వేరొక చోటుకు తరలించేందుకు కూడా మరో టెండర్ ఖరారు చేశారు. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని దేవదాయ శాఖ సలహాదారు కొండలరావు పరిశీలించి, మరమ్మతులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. దీంతో, గందరగోళం నెలకొంది. పాత సత్రం మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే, మరమ్మతులు చేశాక కూడా అది కూలిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించి, సత్రం కూల్చివేతపై జేఎన్‌టీయూకే ప్రొఫెసర్ల అభిప్రాయం కోరారు. వారు మరమ్మతులకు బదులు సత్రం కూల్చివేతకే సిఫారసు చేశారు. ఈ మేరకు పాత భవనం కూల్చివేసి, గతంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ద్వారా కొత్త సత్రం నిర్మించాలని కమిషనర్ ఆదేశించారు. గత ఏడాది కార్తిక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆ తరువాత పాత భవనం కూల్చివేయాలని నిర్ణయించారు. గత డిసెంబర్‌లో పాత భవనంలో సగ భాగం కూల్చేశారు. ఇక్కడే కొత్త సత్రం నిర్మించనున్నారు.
105 గదులతో..
గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడంతస్తుల్లో ఎ–బ్లాక్ పేరిట కొత్త సత్రాన్ని నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను పార్కింగ్‌కు కేటాయిస్తారు. ప్రతి అంతస్తుకు 35 చొప్పున మూడంతస్తుల్లో 105 గదులు నిర్మిస్తారు. నిర్మాణం 16 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది పూర్తయ్యాక సీతారామ సత్రంలో మిగిలిన భాగాన్ని కూడా కూల్చివేసి అక్కడ కూడా మరో 105 గదుల సత్రాన్ని నిర్మిస్తారు.
వచ్చే ఏడాది జూన్‌కు పూర్తి
కొత్త సత్రం నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తాం. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నాం. ఈ మేరకు దేవస్థానం ఈఈ రామకృష్ణను ఆదేశించాం. రత్నగిరి రెండో మెట్ల దారికి ప్రారంభంలో రూ.30 లక్షలతో ఆర్చి, మెట్ల పక్కన పారాపెట్ వాల్ పనులు చురుకుగా జరుగుతున్నాయి.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
ఎట్టకేలకు కొత్త సత్రం నిర్మాణం


