బీసీల వర్గీకరణ అవసరం
● వారు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారు
● సీపీఐ నేతలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వెనుకబడిన తరగతులు ఎప్పుడూ వెనుకబడే ఉంటున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, సీనియర్ నాయకుడు కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కాకినాడ సూర్య కళా మందిరంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట నిర్వహిస్తుందని చెప్పారు. జనగణనలో భాగంగా కులగణన చేపడితే బీసీల సంఖ్య తేలుతుందన్నారు. బీసీల్లోని వివిధ ఉప కులాల వారికి సమాన అవకాశాలు కల్పించేందుకు ఎ, బి, సి, డి కేటగిరీలుగా వర్గీకరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అన్ని కులాలకు, వర్గాలకు సమాన అవకాశాలు లభించినప్పుడే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందినట్లని అన్నారు. కులవృత్తిదార్లకు చిన్న చిన్న పరికరాలు అందించి ఓట్లు దండుకుంటున్నారని, ఇది వారి అభివృద్ధి, సంక్షేమం కాదని, ఆధునిక బానిసత్వమని అన్నారు. ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరుగులు పెడుతూంటే మన దేశంలో కులాలకు, కుల వృత్తులకు బీసీలను కట్టిపడేస్తున్నారని అన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ, జనగణనలో భాగంగా కులగణన జరిపించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ తీర్మానం చేసి, అందుకు కావలసిన కార్యాచరణ అమలు చేసే విధంగా ముందుకు కదలాలని కోరారు. ఆయా పార్టీలపై బీసీ నాయకులు ఒత్తిడి తేవాలన్నారు. జనగణనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను సమగ్రంగా నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు, నాయకులు అక్కినేని వనజ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, పి.హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు నులిపురుగుల
నివారణ దినం
కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా మంగళవారం నులి పురుగుల నివారణ దినం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) నరసింహ నాయక్ తెలిపారు. తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కార్యక్రమం వాల్‌పోస్టర్‌ను రాష్ట్ర నోడల్ అధికారి జె.మల్లీశ్వరితో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని చెప్పారు. 1–2 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు సగం మాత్ర, 2–19 ఏళ్ల వారికి పూర్తి మాత్ర ఇస్తామన్నారు. ఒకటి నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు మాత్ర పొడి చేసి అందిస్తామన్నారు. అనుబంధ శాఖల సహకారంతో నూరు శాతం మాత్రల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 4,077 కేంద్రాల్లో 4,38,904 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేస్తామని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఈ మాత్రలు వేసుకోవడం వలన రక్తహీనతకు తెరపడి పిల్లల్లో ఆరోగ్యం, ఎదుగుదల వృద్ధి చెందుతాయని చెప్పారు. కార్యక్రమంలో డీఐఓ కేవీ సుబ్బరాజు, ఎన్‌సీడీ ఆర్‌బీఎస్‌కే డీసీ వి.అరుణ, ఎపిడమాలజిస్టు ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.


