సర్వం శివమయం | - | Sakshi
Sakshi News home page

సర్వం శివమయం

Feb 16 2026 7:24 AM | Updated on Feb 16 2026 7:24 AM

సర్వం

సర్వం శివమయం

శివరాత్రి వేళ భక్తజనసాగరాలైన ఆలయాలు

‘లక్ష’కు మిక్కిలిగా పాదగయకు..

‘లక్ష’ణంగా సామర్లకోటకు

తరలి వచ్చిన భక్తులు

పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు

పరమ శివునికి అభిషేకాలు

ప్రతిధ్వనించిన శివనామస్మరణ

పిఠాపురం: మహాశివరాత్రి పర్వదినాన జిల్లాలో భక్తిరసం తెప్పలుగా ప్రవహించింది. ముక్కంటి కరుణ కోసం భక్తజనకోటి ‘శివ’మెత్తి మొక్కింది. వేలాదిగా భక్తులు వేకువజాము నుంచే పుష్కరిణులు, నదులు, గోదావరి కాలువలకు చేరుకుని, పుణ్యస్నానాలు ఆచరించి.. పరమ శివునికి భక్తితో ప్రణమిల్లారు. భక్తుల శివనామస్మరణలు ఆలయాల్లో ప్రతిధ్వనించాయి.

దేశంలోని మూడు గయా క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన పిఠాపురంలోని పాదగయ క్షేత్రానికి 2 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. పట్టణంలో ఎక్కడ చూసినా జనప్రవాహమే కనిపించింది. పాదగయలో గయాసురుని పాదాలున్నాయన్నది భక్తుల విశ్వాసం. అందువలన శివరాత్రి నాడు ఇక్కడ పుణ్యస్నానమాచరిస్తే సకల పాపాలూ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ పాదగయకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీగా బారులు తీరి మరీ కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో రాజరాజేశ్వరి, పురుహూతికా అమ్మవార్లకు, దత్తాత్రేయుడు, సాయిబాబాలను దర్శించుకున్నారు. కొందరు గంగామాతకు దీపారాధనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పితృతర్పణాలు, పిండప్రదానాలు ఆచరించారు. కుక్కుటేశ్వర స్వామివారికి అర్చకులు ఆదివారం వేకువజామున ఒంటిగంట నుంచి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి స్వామి వారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. స్వామివారికి రాత్రి లింగోద్భవ కాలాభిషేకం నిర్వహించారు. భక్తులు వచ్చిన వాహనాలతో 216 జాతీయ రహదారితో పాటు ఉప్పాడ, సామర్లకోట రోడ్లపై పలుమార్లు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పట్ణణంలోని సోమేశ్వరస్వామి, సకలేశ్వరస్వామి ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి.

పంచారామ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి సుమారు లక్ష మంది భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటి గంట నుంచే క్యూలలో బారులు తీరారు. ఆలయం తెరచిన వెంటనే హరహర మహాదేవ శంభోశంకరా అనే నినాదం ఆలయ ప్రాంగణంలో మార్మోగింది. స్వామివారికి అర్చకులు తొలిగా క్షీరాభిషేకం, పిఠాపురం మహారాజా గోత్రనామాలతో తొలి పూజ చేశారు. వీటిని తిలకించేందుకు భక్తులు పోటీ పడ్డారు. రాత్రి 10 నుంచి 12.15 గంటల వరకూ స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజలో గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణా, కావేరి, భీమరథి, పుష్కరిణి, తుంగభధ్ర, సింధు, ప్రణీత నదుల జలాలతో అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు గోదావరి కాలువ, ఆలయ పుష్కరిణుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు విడిచిపెట్టారు. పితృదేవతలను స్మరిస్తూ దానాలు ఇచ్చారు.

ఏలేరులో భక్తజన తరంగం

ఏలేశ్వరం: శివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలేరు నదిలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఏలేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం నుంచి ఏలేరు నది వరకూ రహదారి భక్తులతో కిటకిటలాడింది. ఏలేరు నది సమీపంలోని శివుని విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

భక్తజన వాహిని: ఏలేశ్వరం వద్ద ఏలేరు నదిలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు

సర్వం శివమయం1
1/3

సర్వం శివమయం

సర్వం శివమయం2
2/3

సర్వం శివమయం

సర్వం శివమయం3
3/3

సర్వం శివమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement