సమస్యల జడిలో..
కాకినాడ క్రైం: తల్లీబిడ్డల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస వేతనం లేకపోగా శ్రమదోపిడీకి గురవుతూ, ఇతర ఒత్తిళ్లకు లోనవుతూ సతమతమవుతున్నారు. కాలానుగుణంగా అనేక మార్పులు వస్తున్నా తమ జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పూ లేదని ఆవేదన చెందుతున్నారు.
జీతం గోరంత.. పని కొండంత
జీతం గోరంత, పని భారం కొండంత అన్నట్లుగా ఉంది అంగన్‌వాడీల పరిస్థితి. అంగన్‌వాడీ కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులు చెప్పాలి. ప్రతి విద్యార్థితో నోట్స్ రాయించాలి. ఎత్తు, బరువులు కొలిచి నమోదు చేయాలి. ఇంటింటికీ తిరిగి గర్భిణులు, బాలింతల ఆరోగ్య స్థితిని ప్రతి రోజూ పర్యవేక్షించాలి. బరువు తక్కువగా ఉన్న పిల్లల బరువు పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. గర్భిణులను ఎప్పటికప్పుడు ఆసుపత్రులకు పంపించి, వైద్య సేవలు అందేలా చూడాలి. లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలి. చంటిపిల్లలు, బాలింతలు, గర్భిణులకు వ్యాక్సిన్లు వేయించాలి. గర్భిణులకు సీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాశనలు చేయించాలి. ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించాలి. వైద్య, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రతి ఆరోగ్య కార్యక్రమంలోనూ పాల్గొనాలి. ప్రతి నెలా రెండు సమావేశాలకు వెళ్లాలి. ప్రత్యేక దినాల్లో జరిగే ర్యాలీల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇన్ని పనులు చేస్తున్నా రూ.11,500 వేతనం మాత్రమే ఇస్తున్నారంటే వారి దయనీయ స్థితిని అర్ధం చేసుకోవచ్చు.
జీతంలో కోతలు
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు, ఇతర ఖర్చులను ప్రభుత్వం ఇవ్వాలి. కానీ, ఆ భారం సిబ్బంది పైనే పడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలు తాగేందుకు మున్సిపల్ నీరే ఇస్తున్నారు. కానీ, అది ఎక్కడైనా కాలుష్యమయమవుతుందేమోననే భయంతో పలువురు కార్యకర్తలు సొంత ఖర్చుతో ఆయా కేంద్రాలకు మంచినీటి క్యాన్లు వేయిస్తున్నారు. రేషన్ దుకాణం నుంచి సెంటర్‌కు సరకుల రవాణాకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 వరకూ ఇస్తోంది. కానీ, వాస్తవంగా దీనికి కనీసం రూ.300 ఖర్చవుతోంది. వివిధ సందర్భాల్లో మిల్లెట్స్‌తో ఆహార పదార్థాలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల వంటివాటన్నింటికీ చేతిచమురు వదిలిపోతోంది. పిల్లలకు వండి పెట్టేందుకు గ్యాస్, కూరగాయలు, వంట నూనె వంటి వాటికి ప్రభుత్వం ఇప్పటికీ పైసల్లోనే ఇస్తూండగా, వాస్తవంగా వాటి ధరలు మాత్రం రూ.పదులు దాటేశాయి. ఈ సరకుల కొనుగోలుతో పాటు రేషన్ తరలింపు వంటి వాటికి అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతి నెలా రూ.2 వేల వరకూ సొంతంగా వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం పొంతన లేని చెల్లింపులే చేస్తోంది.
‘యాప్’సోపాలు
వివిధ యాప్‌ల వలన కూడా అంగన్‌వాడీ కార్యకర్తలు నానా అగచాట్లూ పడుతున్నారు. పోషణ్ ట్రాకర్, బాల సంజీవని యాప్‌లలో హాజరు సహా పలు వివరాలు నమోదు చేయాలి. నెలలో ఎక్కువ రోజులు సర్వర్ల సమస్యతో ఈ యాప్‌లు పని చేయవు. నమోదు పూర్తయితేనే కానీ రేషన్ ఇచ్చే అవకాశం ఉండదు. ఈలోగా లబ్ధిదారులు వెళ్లిపోతే, వారి ఇళ్లకు వెళ్లి మరీ రేషన్ ఇవ్వాల్సి వస్తోంది. ఆధార్‌లో పాత ఫొటో ఉండి, తాజాగా ఫొటో తీస్తూంటే ఎఫ్‌ఆర్‌ఎస్ సహా మిగిలిన యాప్‌లలో ‘మిస్‌మ్యాచ్’ అని వస్తోంది. ఈ యాప్‌లు చాలవన్నట్లు అభా, అపారా యాప్‌లను కూడా అంగన్‌వాడీలే నిర్వహించాల్సి వస్తోంది. రికార్డుల్లో రాసుకున్న వివరాలే యాప్‌లలో కూడా నమోదు చేస్తూండటంతో ఒకే పని రెండుసార్లు చేయాల్సి వస్తోంది. దీనివలన పనిభారం పెరుగుతోంది. ఈ సమస్యలు పరిష్కరించకపోగా.. పని సకాలంలో పూర్తి చేయాలంటూ అధికారులు తమ మెడపై కత్తి పెడుతున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. దీనికితోడు ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపై పనిభారం రెట్టింపవుతోంది.
స్థానిక నేతల అజమాయిషీ
మరోవైపు తమపై అధికార కూటమి నేతల పెత్తనం నానాటికీ మితిమీరుతోందని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రం తరఫున ఏవైనా కార్యక్రమాలు నిర్వహిస్తే మూడు పార్టీల నాయకులు ఎవరికి వారే తమను తప్పనిసరిగా పిలవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎవరిని పిలిస్తే ఎవరు అలుగుతారో అర్థం కాక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలకు మంగళం
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఐసీడీఎస్ స్కీమ్ వర్కర్లుగా మాత్రమే ఉన్నారు. వీరిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు. అయినప్పటికీ ప్రభుత్వ పోర్టల్‌లో మాత్రం వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగానే చూపిస్తున్నారు. తద్వారా వీరికి అందాల్సిన అన్ని రకాల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. కాకినాడ జగన్నాథపురంలో దివ్యాంగురాలైన ఓ అంగన్‌వాడీ ఆయాకు ప్రభుత్వం రూ.6 వేల సామాజిక భద్రతా పెన్షన్ ఇవ్వాల్సి ఉంది. ఆమె పేరు ప్రభుత్వ ఉద్యోగిగా నమోదైందని, ఆయాగా ఆమె నెలకు రూ.7 వేల గౌరవ వేతనం అందుకుంటోందని పేర్కొంటూ సామాజిక భద్రతా పెన్షన్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. వివిధ స్థాయిల్లో అధికారులను నిలదీస్తే తప్ప ఆమెకు ఆ పెన్షన్ మంజూరు చేయలేదు. ఈవిధంగా ఎంతోమంది అంగన్‌వాడీ సిబ్బంది వివిధ సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. పోర్టల్‌లో ప్రభుత్వ ఉద్యోగి అనే మాటను తొలగించే అవకాశముంది. కానీ, ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకూడదనే కుతంత్రంతోనే తొలగించడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఫ వెట్టిచాకిరీతో
అంగన్‌వాడీల నరకయాతన
ఫ జిల్లాలో 3,916 మంది సిబ్బంది
ఫ పోర్టల్‌లో ప్రభుత్వోద్యోగులుగా
తప్పుడు నమోదు
ఫ సంక్షేమ పథకాలు వర్తించక అగచాట్లు
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 9
సీడీపీఓలు 9
సెక్టార్లు 70
సూపర్‌వైజర్లు 56
మొత్తం సెంటర్లు 1,986
అంగన్‌వాడీ కార్యకర్తలు 1,980
ఆయాలు 1,936
సేవలు పొందుతున్న గర్భిణులు 8,966
బాలింతలు 8,985
6–36 నెలల బాలలు 45,701
3–6 ఏళ్ల బాలలు 22,639
ఖాళీ పోస్టుల వివరాలు
సూపర్‌వైజర్లు 24
ఆయా 50
అంగన్‌వాడీ టీచర్ 6
మొత్తం 80
మద్దతిచ్చిన వారు మాయమయ్యారు
గతంలో సమస్యలపై ఉద్యమిస్తే మద్దతిచ్చిన కూటమి నేతలు ఇప్పుడు మాయమయ్యారు. ఆఖరికి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చుల్లోనూ మాయాజాలం చేస్తున్నారు. రూ.20 వేలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం తీర్మానిస్తే రూ.15 వేలు మాత్రమే ఇవ్వాలని కూటమి సర్కారు జీఓ ఇచ్చింది. మరో తప్పుడు జీఓతో గ్రాట్యుటీ ప్రయోజనానికి వక్రభాష్యం చెప్పి అంగన్‌వాడీల భవితతో ఆటలాడుతోంది. 2011 నుంచి కేంద్రం తన వాటాగా అంగన్‌వాడీల జీతం పెంచలేదు. దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,200 మాత్రమే పెంచింది. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి ప్రయోజనాలేవీ లేవు. ప్రభుత్వ వైఫల్యమే ఇన్ని సమస్యలకు కారణం.
– గోసంగి బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
సమస్యల జడిలో..


