అమెరికా యుద్ధోన్మాదం నశించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం నశించాలనే ఆకాంక్షతో వామపక్షాల ఆధ్వర్యాన స్థానిక మసీదు సెంటర్‌లో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ, వెనెజువెలా అధ్యక్షుడిగా చావేజ్ ఎన్నికై నప్పటి నుంచి ఆ దేశంపై అమెరికా కక్ష కట్టిందన్నారు. చావేజ్ వారసుడిగా అధికారం చేపట్టిన నికోలస్ మధురో కూడా అమెరికా ఆగడాలకు అడ్డుకట్ట వేశారన్నారు. ఇది ఆ దేశానికి కంటగింపుగా మారిందన్నారు. పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలున్న వెనెజువెలాను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి అమెరికన్ కార్పొరేట్ ఆయిల్ కంపెనీల ఒత్తిడితో ట్రంప్ మధురోను చెరబట్టారని ఆరోపించారు. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను, లిబియా అధ్యక్షుడు అమెరికన్ సామ్రాజ్యవాదం హతమార్చిందని విమర్శించారు. తాజాగా ఈ నెల 3న వెనెజువెలా దేశాధ్యక్షుడు మధురోతో పాటు ఆయన భార్యను కూడా అమెరికా కిడ్నాప్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచానికి నీతులు చెప్పే అమెరికా.. అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందన్నారు. భారత ప్రధాని మోదీ కూడా తనను సంతోషపరచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలకు భారత్ దీటుగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధురో దంపతులను వెంటనే విడుదల చేయాలని, ప్రపంచ దేశాలతో భారత ప్రభుత్వం గొంతు కలపాలని కోరారు. ప్రజలందరూ అమెరికన్ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదాన్ని ఖండించాలని, ప్రపంచ శాంతి కోసం నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా నాయకుడు సీహెచ్ నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.


