జ్వరమొచ్చింది
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కాకినాడ జీజీహెచ్‌లో జ్వరం కేసులు
నెల కేసులు సెప్టెంబర్ 3,558 అక్టోబర్ 3,041 నవంబర్ 5,152 డిసెంబర్ 15 4,015
● మంచం పడుతున్న జిల్లా
● జలుబు, దగ్గుతో అవస్థలు
● కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
సాక్షి ప్రతి
నిధి, కాకినాడ: జిల్లాకు జ్వరమొచ్చింది. దాదాపు ప్రతి ఇంటా ఒకరిద్దరు దగ్గు, జలుబుతో మంచం పడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జిల్లా అంతటా ఉష్ణోగ్రతలు ఒకేసారి అమాంతం పడిపోయాయి. ఉదయం 10 గంటల వరకూ.. తిరిగి సాయంత్రం 4 దాటకుండానే వీస్తున్న శీతల గాలులతో జనం గజగజా వణికిపోతున్నారు. చలి వేళ బయటకు రావాలంటేనే హడలెత్తుతున్నారు. వృద్ధులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు. సూరీడు నడినెత్తికి వచ్చేంత వరకూ వీరు బయటకు రావడం లేదు. తప్పనిసరి అయి ఏదైనా పనిపై చలి వాతావరణంలో బయటకు వెళ్లి వస్తే చాలు.. తెల్లారేసరికి జలుబుతో కూడిన దగ్గు బారిన పడుతున్నారు. ఇంట్లో ఒకరికి ఈ తరహా అనారోగ్యం వస్తే ఇంటిల్లిపాదినీ చుట్టేస్తోంది. చాలా మంది వులెన్ స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు లేకుండా బయటకు వెళ్లడం లేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా శీతల ప్రభావాన్ని తప్పించుకోలేకపోతున్నారు.
జలుబు, దగ్గుతో మొదలై..
వయసుతో సంబంధం లేకుండా జలుబు, దగ్గుతో మొదలవుతున్న జ్వరాలు వైరల్ ఫీవర్లుగా మారుతున్నాయి. ఈ లక్షణాలతో జ్వరం వస్తే వారం పది రోజులకు గానీ ఆరోగ్యం కుదుట పడటం లేదు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్) సహా పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని ఏరియా ఆస్పత్రులు, జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు వైరల్ ఫీవర్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వైరల్ ఫీవర్లతో కాకినాడ జీజీహెచ్‌కు వస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంటోంది. వైరల్ ఫీవర్, ఫ్లూ, కామన్ కోల్డ్, ఇన్‌ఫ్లూయెంజా, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మూడు నుంచి 60 ఏళ్ల లోపు వారిలో ఈ తరహా జ్వరాలు ఎక్కువగా ఉంటున్నాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లే ఈ జ్వరాలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. అడినోవైరస్, ఇన్‌ఫ్లూయెంజా వైరస్, రైనోవైరస్‌లు జ్వర కారకాలని అంటున్నారు. డెంగీ చికన్‌గున్యాలు ఈ కోవకే వస్తాయని, ఈ జ్వరాలను అలక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జ్వరం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించదని అనుకుంటారు. కానీ, వైరల్ ఫీవర్ల విషయంలో అది పూర్తిగా తప్పని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరచాలనం, ఒకే వస్తువులు వాడటం, శారీరక ద్రవాల తాకిడి వైరస్ వ్యాప్తికి కారణమై జ్వరం సంక్రమణకు దారి తీస్తుంది.
తప్పించుకుంటున్న ప్రభుత్వం
వాతావరణ మార్పులే దీనికి కారణమంటూ తప్పించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విమర్శలున్నాయి. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ మంచి ఫలితాలు సాధించింది. ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్‌తో పాటు వైద్యుల బృందం క్రమం తప్పకుండా వెళ్లడం, బీపీ, షుగర్, ఇతర వ్యాధి లక్షణాలను పరిశీలించి, అవసరమైన మందులు ముందుగానే ఇవ్వడం ద్వారా వైరల్ జ్వరాలను నియంత్రణలోకి తెచ్చేవారు. ప్రజలకు ఎంతో మేలు చేసిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రాజకీయ కోణంలో ఆలోచించి నీరుగార్చేసింది. ఫలితంగానే నేడు ప్రతి ఇంటా అనేక మంది మంచాన పడుతున్న దుస్థితి తలెత్తింది.
సొంత వైద్యం.. ప్రమాదకరం..
జలుబు, దగ్గే కదా అని ఆస్పత్రులకు వెళ్లకుండా చేతికొచ్చిన నాలుగు మందు బిళ్లలు వేసుకుంటే అదే పోతుందనే భావనతో కొంత మంది సొంత వైద్యం చేసుకుంటున్నారు. మెడికల్ షాపులు, వైద్య పరిజ్ఞానం లేని వారు ఇచ్చే మందులను ఐదారు రోజులు వాడినా ఆరోగ్యం కుదుట పడకపోతూండటంతో అప్పుడు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డెంగీ, టైఫాయిడ్, న్యూమోనియా వంటి ప్రమాదకర జ్వరాలను కూడా సాధారణ జ్వరాలనుకుని, బయటి మందులు ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చని చెబుతున్నారు. అలాగే, అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ వాడితే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగి మందులు శరీరానికి పని చేయని స్థితికి చేరుకుంటాం. సొంత వైద్యం వికటిస్తే కడుపులో పుండ్లు, లివర్, కిడ్నీలు దెబ్బ తినడం, అలర్జీలు, వాంతులు, విరేచనాల వంటి వాటి బారిన పడే ప్రమాదముంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సొంత వైద్యం అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
నిర్లక్ష్యం తగదు
వైరల్ ఫీవర్లను నిర్లక్ష్యం చేయడం తగదు. వైరల్ ముదిరితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు చేరి న్యూమోనియాకు దారి తీసి, ప్రాణాంతకం కావచ్చు. పిల్లల్లో ఈ స్థితి మరింత ప్రమాదకరం. సొంత వైద్యాలకు స్వస్తి చెప్పి, వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స చేయించుకోవాలి. జీజీహెచ్‌లో నిష్ణాతులైన వైద్యుల ద్వారా వైరల్ ఫీవర్లకు నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం. చలి వాతావరణంతో శ్వాసకోశ వ్యాధులకు ఆస్కారం ఉంటుంది. నిర్లక్ష్యం చేయవద్దు. ఆవిరి పట్టడం, మాస్క్, శానిటైజర్ వినియోగించడం వంటివి వైరస్ వ్యాప్తిని నిలువరిస్తాయి. రోగ నిరోధక శక్తి క్షీణించిన వారితో పాటు పౌష్టికాహార లోపం, వయోభారంతో బాధపడుతున్న వారు, గర్భం దాల్చిన వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
– డాక్టర్ మాణిక్యాంబ, పీడియాట్రిక్స్ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడ
నియంత్రణపై దృష్టి పెట్టాం
వాతావరణ మార్పుతో చలి తీవ్రత పెరిగి దగ్గు, జలుబుతో కూడిన జ్వరాలు నమోదవుతున్నాయి. వైరల్ జ్వరాలుంటే హైగ్రేడ్ ఫీవర్లు ఎక్కువగా వస్తాయి. కో మార్బిడిటీల వల్ల ప్రమాదం వాటిల్లవచ్చు. ఎస్–ఫాం, ఎల్–ఫాం, పీ–ఫాం యాప్‌ల ద్వారా జ్వరాలను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ యాప్‌లలో నమోదవుతున్న కేసుల ఆధారంగా మెడికల్ ఆఫీసర్లు జ్వర పీడితులకు చికిత్స అందిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు చురుగ్గా పని చేస్తాయి. ఈ టీములోని ఎపిడమాలజిస్టు, మైక్రోబయోలజిస్టు, పాథాలజిస్టు, ఫిజీషియన్, పీడియాట్రీషియన్ జ్వరాలు వస్తున్న ప్రాంతాల్లో పరిస్థితిని విశ్లేషిస్తారు.
– డాక్టర్ జరపల నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, కాకినాడ
జ్వరమొచ్చింది
జ్వరమొచ్చింది
జ్వరమొచ్చింది
జ్వరమొచ్చింది


