‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మంతో వ్యా పారం చేసేవాడు నీచుడంటూ ధర్మరాజు చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన గురువారం కొనసాగించారు. ‘భీష్మ, ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థా మ, కర్ణులను నిర్జించడానికి కావలసిన అస్త్ర సంపద మన వద్ద లేదని సోదరులకు ధర్మరాజు చెబుతాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజును ఏకాంతంలోకి పిలిచి, ప్రతిస్మృతి విద్యను బోధించి, దీనిని అర్జునుడికి ఉపదేశించాలని చెబుతాడు. ఆయన స్వయంగా అర్జునుడికి ఉపదేశించకుండా అన్నగారికి ఎందుకు ఉపదేశించాడనే సందేహం మనకు రావచ్చు. మంత్రవిద్యకు కొన్ని సంప్రదాయాలు, మర్యాదలు ఉన్నాయి. కొడుక్కి తండ్రి, తమ్ముడికి అన్న, భార్యకు భర్త మంత్రాన్ని ఉపదేశించవచ్చు’ అని వివరించారు. ‘‘భూలోక కాలగణన ప్రకారం ఐదేళ్ల పాటు ఇంద్రలోకంలో ఉన్న అర్జునుడి ని నపుంసకుడివి కావాలని ఊర్వశి ఇచ్చిన శాపం అజ్ఞాతవాస కాలంలో వరమవుతుందని ఇంద్రుడు చెబుతాడు. రాజ్య సంపదలపై నీ బుద్ధి ఎందుకు నిలవడం లేదని ధర్మరాజును వనాలలో ద్రౌపది ఆక్షేపిస్తుంది. తాను ఫలాన్ని ఆశించి ధర్మాచరణకు పూనుకోనని ధర్మరాజు చెబుతాడు. స్వర్గాది భోగాల కోసం ధర్మాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టం చేస్తాడు. ధర్మం పాటించాలి కనుకనే ధర్మాన్ని ఆశ్రయిస్తున్నానని, ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడని, ధర్మం వ్యాపార వస్తువు కాదని అంటాడు’’ అని సామవేదం వివరించారు.


