మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించాలి
● సీపీఐ నేత మధు డిమాండ్
● ప్రభుత్వాసుపత్రి వద్ద ధర్నా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర సమితి పిలుపు మేరకు సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్‌లు మెడికల్ కాలేజీ సీట్లపై అనేక మాటలు చెప్పారని, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపించారని.. నేడు అధికారంలోకి రాగానే వారు మొత్తం మెడికల్ కాలేజీలనే అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటీకరించేందుకు జారీ చేసిన జీఓ–590ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలలను పీపీపీ విధానంలోకి తీసుకుని రావడం వలన రూ.3,700 కోట్ల అభివృద్ధి ఖర్చు, ఏటా రూ.500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతాయని ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి ఈ విధానం రాష్ట్రానికి దీర్ఘకాలంలో తీరని నష్టం కలిగిస్తుందని చెప్పారు. సుమారు 60 ఏళ్ల పాటు ప్రభుత్వ భూమి, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లి, వారికి ఆదాయ వనరులుగా మారతాయని అన్నారు. వైద్య విద్య పూర్తిగా వ్యాపారపరమవుతుందని, మేనేజ్‌మెంట్ కోటా ద్వారా ఇచ్చే 25 శాతం సీట్లలో ఒక్కో దానికి దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ వసూలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ అధిక ఫీజు వలన పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థల లాభాపేక్ష వల్ల వైద్య సేవల్లో నాణ్యత తగ్గడంతో పాటు, పేదలకు ఉచిత వైద్య సేవలు అందని ద్రాక్షగా మారతాయని వివరించారు. పీపీపీ విధానం వలన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలు సుమారు 55 శాతం వైద్య విద్య సీట్లను కోల్పోతారన్నారు. నాబార్డ్ నిధులతో నిర్మించే వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా కట్టబెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మధు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాకా రామకృష్ణ, ఏఐటీయూసీ నాయకులు రామయ్య, అనిల్ పాల్గొన్నారు.


