పీడీలు ఏరీ..!
రాజమహేంద్రవరం రూరల్: ఇప్పటి వరకూ ఎటువంటి రూపురేఖలూ లేని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఘనంగా చెప్పారు. ఒలింపిక్స్ సంగతి అలా ఉంచితే.. అసలు క్రీడల అభివృద్ధిలో.. క్రీడాకారులకు తగిన శిక్షణ ఇచ్చి తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్ల (పీడీ) పాత్ర ఎంతో కీలకం. వీరు ఆయా కళాశాలల్లో క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. వీరి విధుల్లో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకమైనది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పీడీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు.
ఆరుచోట్ల ఇన్‌చార్జిలే..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బొమ్మూరు, అనపర్తి, ద్రాక్షారామ, కాకినాడ, ఎటపాక, పిఠాపురం, కాకినాడ(మహిళ)ల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మరో 18 ప్రైవేటు కళాశాలలున్నాయి. మొత్తం ఏడు ప్రభుత్వ కళాశాలలకు గాను కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ప్రస్తుతం రెగ్యులర్ పీడీ ఉన్నారు. మిగిలిన అన్నిచోట్లా ఆయా కళాశాలల లెక్చరర్లనే ఇన్‌చార్జి పీడీలుగా నియమించి, ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. దీంతో, ఆయా లెక్చరర్లు అటు సబ్జెక్టుల బోధనకు.. ఇటు క్రీడా శిక్షణకు సమయం కేటాయించలేని దుస్థితి నెలకొంది. రెండు విధులూ నిర్వహించాల్సి వస్తూండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో పీడీలు ఉండటంతో అక్కడి విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో మెరుగైన శిక్షణ లభిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా పూర్తి స్థాయిలో పీడీలను నియమిస్తే వివిధ క్రీడల్లో మరింత మంది విద్యార్థులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.
తేడా స్పష్టం
పీడీలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రస్తుతం బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ రీజినల్ మీట్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత నైపుణ్యంతో మాత్రమే వివిధ పోటీల్లో విజయం సాధిస్తున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ తమకు తగిన మెళకువలు నేర్పాల్సిన పీడీలు లేకపోవడంతో వెనుకబడుతున్నామని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. ఈ మీట్‌లో ఉమ్మడి జిల్లాలోని మొత్తం 25 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే తమకు సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పూర్తి స్థాయి పీడీలను నియమించాలని వారు కోరుతున్నారు. రీజినల్ స్పోర్ట్స్ మీట్‌కు వేదికగా నిలిచిన బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సైతం రెగ్యులర్ పీడీ లేరు. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరరే ఇన్‌చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. అయితే, రీజినల్ స్పోర్ట్స్ మీట్‌కు ప్రొఫెషనల్ పీడీ అవసరం కావడంతో కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పీడీని ఇన్‌చార్జిగా రప్పించుకోవాల్సి వచ్చింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు పూర్తి స్థాయిలో పీడీలను నియమించాలని పలువురు కోరుతున్నారు.


